-భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవాన్ని ఘనవిజయం చేద్దాం
-చీపురుపల్లి నియోజకవర్గ టిడిపి సమావేశంలో పాల్గొన్న కళా వెంకట్రావు, గద్దె బాబురావు, దేవినేని ఉమా
విజయనగరం జిల్లా, చీపురుపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి చీపురుపల్లి శాసనసభ్యులు కళా వెంకటరావు, మాజీ శాసనసభ్యులు గద్దె బాబురావు లతో కలిసి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ, మండల నేతలు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా నిలవనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆగస్టు 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి విజయవంతం చేయడం ప్రతి తెలుగుదేశం కార్యకర్త బాధ్యత అని అన్నారు.
ఒకప్పుడు “ఎర్ర బస్సు రాని ఈ ప్రాంతానికి ఎయిర్‌పోర్ట్ అవసరమా?” అని ప్రశ్నించిన వైసీపీ నేతలకు, భోగాపురంలో దిగనున్న తొలి ఎయిర్‌బస్‌నే సమాధానంగా నిలుస్తుందని దేవినేని ఉమా పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు భోగాపురం ఎయిర్‌పోర్ట్ కీలక మైలురాయిగా నిలవనుందని అన్నారు.
గత ప్రభుత్వ అరాచక, విధ్వంసక, అవినీతి పాలనతో వెనుకబడిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంలో తిరిగి అభివృద్ధి పథంలో నడిపిస్తూ, ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
Prajavartha Online Telugu News