-శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న అంతర్జాతీయ ప్రముఖులు
-ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ యంత్రాంగం
-అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఈరోజు (శనివారం) ఉదయం ఆస్ట్రేలియా సహాయ మంత్రి (సిటిజన్‌షిప్, కస్టమ్స్, మల్టీకల్చరల్ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ విద్యాశాఖ సహాయ మంత్రి) జూలియన్ హిల్ (Hon. Julian Hill) తమ అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడ విచ్చేసిన ఆస్ట్రేలియా బృందానికి, ఇంద్రకీలాద్రి రాజగోపురం వద్ద ఆలయ అధికారులు, అర్చకస్వాములు మంగళవాయిద్యాలు మరియు వేదమంత్రోచారణల నడుమ స్వాగతం పలికారు.
అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ మరియు వారి అధికార ప్రతినిధుల బృందాన్ని ప్రధాన ఆలయానికి తోడ్కొని వెళ్లారు. గర్భగుడిలోని మూలవిరాట్ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని వారు కళ్లారా తిలకించి తన్మయం చెందారు. ఈ సందర్భంగా అర్చకస్వాములు వారికి ఆలయ ప్రాశస్త్యాన్ని, అమ్మవారి దివ్య చరిత్రను వివరించారు.
దర్శనానంతరం వేదపండితులు వారికి వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికె శీనా నాయక్ ఆస్ట్రేలియా సహాయ మంత్రికి మరియు వారి బృంద సభ్యులకు అమ్మవారి శేషవస్త్రాలు, శ్రీ అమ్మవారి చిత్రపటాన్ని, దివ్య ప్రసాదాలను బహూకరించి గౌరవించారు. అంతర్జాతీయ ప్రముఖుల రాకను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు వన్ టౌన్ పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కొండపై, ఆలయ పరిసర ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News