-రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
-ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించిన యార్లగడ్డ
-వేమండలో ఇప్పటివరకు రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని వెల్లడి
-కలవపాముల రహదారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధిస్తామని హామీ
-గత ప్రభుత్వం రహదారులను నిర్లక్ష్యం చేసిందని ఎమ్మెల్యే యార్లగడ్డ విమర్శ
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉంగుటూరు మండలం వేమండ గ్రామంలో సోమవారం నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. అంతకుముందు రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గన్నవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించడంతో రహదారులు దయనీయ స్థితికి చేరుకున్నాయని విమర్శించారు. గత ఐదేళ్లలో గుడివాడ – కలవపాముల, తరిగొప్పల – మానికొండ తదితర ప్రాంతాలకు వెళ్లే రహదారులు గుంతలమయంగా మారినా పట్టించుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దెబ్బతిన్న రహదారులలో సుమారు 80 శాతం మేర అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మిగిలిన పనులను కూడా దశలవారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వేమండ గ్రామంలో ఇప్పటికే ఆరు సీసీ రోడ్లు, పంచాయతీ కార్యాలయ మరమ్మతులు, వాటర్ ట్యాంక్ మరమ్మతులు, హెడ్ పంప్ ఏర్పాటు వంటి పనులు చేపట్టినట్లు చెప్పారు. ఆర్డీఎస్ఎస్ పథకం కింద రూ.37 లక్షల వ్యయంతో 250 విద్యుత్ స్తంభాల మార్పిడి, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, రూ.12 లక్షలతో వ్యవసాయ విద్యుత్ సేవల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామంలో ఇప్పటివరకు సుమారు రూ.1.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని తెలిపారు. కలవపాముల రహదారి అభివృద్ధికి సుమారు రూ.1.70 కోట్లుఅవసరమవుతున్నాయని, ఈ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులు సాధించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో మిగిలిన సిమెంట్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులకు కూడా ప్రాధాన్యమిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని, ప్రజలు కోరిన ప్రతి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు.కార్యక్రమంలో ఉంగుటూరు మండల తహసీల్దార్ జలాది విమల కుమారి, ఎంపీడీవో ఈ సత్య కుమార్, మండల టిడిపి అధ్యక్షులు కొలుసు రవీంద్రబాబు, మండల టిడిపి ప్రధాన కార్యదర్శి కుందేటి చంద్రశేఖర్, తోట నాగభూషణం, కాపుదాసి సునీల్, గన్నవరం ఏఎంసీ డైరెక్టర్ కొండేటి వెంకటేశ్వరరావు, తేలప్రోలు పిఎసిఎస్ చైర్ పర్సన్ ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, ఉయ్యూరు మురళి, బెజవాడ నాగేశ్వరరావు, రాజబోయిన శివాజీ, తుమ్మల జగదీష్, యర్రగుంట్ల వినోద్, చల్లగుల్ల సందీప్, కొసరాజు సాయిరాం, పసుపులేటి సుబ్బారావు, కానూళ్ల శ్రీను, పకీరు, పొన్నగంటి బాలకృష్ణ, వెనిగళ్ళ రాము, గంప భీమయ్య, యలమంచిలి దినేష్, మరీదు శ్రీను, శివరాం, తుమ్మల లత, పొట్లూరి భువనేశ్వరి జనసేన నాయకులు చిమట రవి వర్మ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News