-మచిలీపట్నం రైతు బజార్లో సబ్సిడీ ధరలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వర్షాభావ పరిస్థితుల కారణంగా మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన బియ్యం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.
సోమవారం ఉదయం మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్ వద్ద ఉన్న రైతు బజార్లో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర సబ్సిడీ ధరలకు బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగాయని, సామాన్య ప్రజలపై ఆర్థిక భారం పడకుండా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో సబ్సిడీ ధరలకు బియ్యం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో స్టీమ్ రైస్ కిలో రూ.62 నుంచి రూ.65 వరకు, రా రైస్ కిలో రూ.58 వరకు విక్రయిస్తుండగా, ప్రభుత్వం స్టీమ్ రైస్‌ను కిలో రూ.52కు, రా రైస్‌ను కిలో రూ.50కు అందిస్తోందన్నారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం అందజేస్తామని తెలిపారు.
రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తోందన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద ప్రతి రైతుకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
మిర్చి, పొగాకు, మామిడి, ఆక్వా రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతిసారీ ప్రభుత్వం వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించిందన్నారు. గతంలో కందిపప్పు, ఉల్లిపాయలు, టమాటాలు తదితర నిత్యావసర వస్తువులను కూడా సబ్సిడీ ధరలకు అందించి మార్కెట్ ధరలను నియంత్రించినట్లు తెలిపారు. అవసరమైతే వంటనూనె వంటి నిత్యావసర వస్తువులను కూడా ప్రజలకు అందుబాటు ధరల్లో అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ధరల నియంత్రణకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.
ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ.. గతంలో రేషన్ బియ్యంపై వినియోగదారులకు మంచి అభిప్రాయం ఉండేది కాదని, దీంతో చాలామంది మార్కెట్లో అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సి వచ్చేదన్నారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైస్ మిల్లర్స్‌తో సంప్రదించి ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. మార్కెట్ ధరతో పోలిస్తే కిలోకు సుమారు రూ.15 తక్కువ ధరకు బియ్యం అందిస్తున్నామని, ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబానికి నెలకు 10 కిలోల బియ్యం అందించడం ద్వారా ఒక్కో కుటుంబానికి సుమారు రూ.150 వరకు ఆదా అవుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక భారం అయినప్పటికీ పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్న ఆయన, ఈ కార్యక్రమానికి సహకరించిన రైస్ మిల్లర్స్‌ను అభినందించారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సబ్సిడీ ధరలకు అందిస్తున్న నాణ్యమైన బియ్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు.
జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ బండి రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రజలపై పెరుగుతున్న బియ్యం ధరల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. మార్కెట్లో 10 కిలోల బియ్యం ధర రూ.650 నుంచి రూ.670 వరకు ఉండగా, ప్రభుత్వం కేవలం రూ.520కే అందించడం ద్వారా ప్రతి కుటుంబానికి గణనీయమైన ఆర్థిక ఉపశమనం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రైస్ మిల్లర్స్‌ను అభినందించిన బండి రామకృష్ణ, సామాన్య ప్రజల ప్రయోజనాల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకాన్ని ప్రతి అర్హ కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో డీఎస్ఓ మోహన్ బాబు, మార్కెటింగ్ శాఖ ఏడి నిత్యానంద్, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె దుర్గాప్రసాద్ నాని, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మెహర్ బాబా, కూటమి నాయకులు లోగిశెట్టి వెంకటస్వామి, తలారి సోమశేఖర్, కే సుశీల, మాదివాడ రాము, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News