గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని హనుమయ్య కంపెనీ నుండి బృందావన్ గార్డెన్స్ సెంటర్ వరకు జరుగుతున్న రోడ్ విస్తరణ పనుల వలన ప్రభావితమయ్యే 73 చెట్లలో 29 చెట్లను రీ లొకేషన్ చేయడానికి వీలు కల్గుతుందని, 44 చెట్లు వీలు కాదన్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్ర విభాగం సూచనల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ కె.మయూర అశోక్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో ఇప్పటికే 7 వేలకు పైగా మొక్కలను నాటి, వాటిని జియో ట్యాగ్ చేయడం జరిగిందన్నారు. రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న మొత్తం 73 అవెన్యూ చెట్లను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, వృక్షశాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్ర విభాగం వారు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఇచ్చిన నివేదిక ప్రకారం, 44 చెట్లు తీవ్ర స్థాయిలో చెదలు మరియు కలపను దెబ్బతీసే కీటకాల (పచ్చతురాయి) ప్రభావానికి లోనైనట్లు గుర్తించబడినదన్నారు. ఈ చెట్ల నిర్మాణ బలం గణనీయంగా తగ్గిపోవడం వల్ల గాలివానలు లేదా ఇతర పరిస్థితుల్లో విరిగి పడే ప్రమాదం ఉన్నదని, ఇప్పటికే కొన్ని చెట్లు కూలిపోయాయన్నారు. ప్రజల భద్రత దృష్ట్యా వాటిని చెట్ల స్థానాంతరణ చేయడం వృక్షశాస్త్రపరంగా సాధ్యం కాదని మరియు అవి జీవించగల అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నివేదికలో పేర్కొనబడినదన్నారు. అదేవిధంగా, మిగిలిన 29 చెట్లు ఆరోగ్యవంతమైన వేర్ల వ్యవస్థ, కాండ నిర్మాణం మరియు జీవసామర్థ్యాన్ని కలిగి ఉన్నందున, శాస్త్రీయ పద్ధతులు మరియు నిపుణుల పర్యవేక్షణలో చెట్ల స్థానాంతరణ చేయుటకు అనుకూలంగా ఉన్నట్లు నివేదికలో తెలియజేయబడినదని తెలిపారు.
కావున, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సమర్పించిన సాంకేతిక నివేదిక ఆధారంగా, 44 తీవ్రంగా దెబ్బతిన్న చెట్లను సంబంధిత నిబంధనల మేరకు తొలగించుటకు చర్యలు చేపట్టబడును. అలాగే, ఆరోగ్యవంతమైన 29 చెట్లను గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అనువైన ప్రదేశాలు మరియు ఇతర తగిన ప్రాంతాలకు శాస్త్రీయ విధానంలో చెట్ల స్థానాంతరణ చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేయబడుచున్నన్నారు.
Tags guntur
Check Also
ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు
-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …
Prajavartha Online Telugu News