గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర పరిధిలోని బృందావన్ గార్డెన్స్ రోడ్ల విస్తరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ మరియు విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయ కమిషనర్ చాంబర్లో బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణ పనులపై పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖ అధికారులు మరియు కాంట్రాక్టర్‌తో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్తరణ పనుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యంపై కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇకపై నిర్లక్ష్యానికి తావులేకుండా పనులను వేగవంతం చేయడానికి ఆయా విభాగాధిపతులే ప్రత్యక్ష పర్యవేక్షణ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, బృందావన్ గార్డెన్స్ రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమయ్యే విద్యుత్ స్తంభాల తరలించడంలో విద్యుత్ శాఖతో జిఎంసి అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. అలాగే పట్టణ ప్రణాళిక అధికారులు ఒక అడ్డ రోడ్డు నుండి మరొక అడ్డ రోడ్డు వరకు ప్రభావిత భవనాలను తొలగించిన క్లియర్ ప్రాంతాన్ని క్షుణ్ణంగా మార్కింగ్ చేసి, డ్రైన్ల నిర్మాణం కోసం తక్షణమే ఇంజినీరింగ్ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. డ్రైన్ నిర్మాణ పనులను ముమ్మరంగా చేపట్టడంతో పాటు, ఎప్పటికప్పుడు నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో మిగిలిపోయిన నిర్మాణ వ్యర్థాలను వెంటనే తొలగించి, ఆ స్థలాన్ని లెవల్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల పురోగతిపై ప్రతిరోజూ క్రమం తప్పకుండా తనకు నివేదిక అందజేయాలన్నారు. నగర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేసి విస్తరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు.
సమావేశంలో సిటి ప్లానర్ డి.రాంబాబు, ఎస్ఈ సుందర్రామిరెడ్డి, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపీ రెహ్మాన్, ఈఈ విష్ణు, డిఈఈ వెంకటరమణ, ఏడీహెచ్ శాంతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News