ఎల్ఐసి లో ప్రభుత్వ వాటాల అమ్మకం ఆపాలి

-బీమా ఉద్యోగుల ఆందోళనకు సిఐటియు మద్దతు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశ అగ్రగామి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్ఐసి లో 6.5% ప్రభుత్వ వాటాల అమ్మకం దేశ స్వావలంబన కు నష్టం చేసే చర్య అని సిఐటియు రాష్ట్ర కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. బీమా ఉద్యోగులు బుధవారం చేసే ఆందోళనలకు పూర్తి మద్దతు ప్రకటించింది.
ఎల్ఐసి కోట్లాదిమంది పాలసీదారుల నమ్మకం, పొదుపుతో ఎదిగిన సంస్థ. దేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు, ప్రజా సంక్షేమానికి, సామాజిక అవసరాలకు లక్షల కోట్ల రూపాయల నిధులు అందించిన సంస్థ. అటువంటి సంస్థలో ఇప్పటికే మోడీ బిజెపి ప్రభుత్వం 3.5% వాటాలను అమ్మింది. 1956 లో ప్రభుత్వం పెట్టిన ఐదు కోట్ల పెట్టుబడికి కేవలం గత ఆర్థిక సంవత్సరానికే 12,200 కోట్ల రూపాయల డివిడెండ్ ను చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో వాటాలు అమ్మడం ద్వారా 21 వేల కోట్ల వరకు పొందినది ఈ డివిడెండ్ తో పోలిస్తే ఎల్ఐసి ప్రాధాన్యత తెలుస్తుంది. సామాజిక న్యాయం, దేశాభివృద్ధి దృష్టి లో ఉంచుకొని ప్రభుత్వ రంగాన్ని, ఎల్ఐసి వంటి సంస్థలను పరిరక్షించుకోవాలని సిఐటియు భావిస్తున్నది. ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సంక్షోభాన్ని ప్రతిబింబిస్తోంది. పెట్టుబడులు ప్రోత్సహించడం లో, నాణ్యమైన ఉపాధి కల్పించడం లో, సుస్థిర మార్గాల ద్వారా ఆదాయం పెంచుకోవడంలో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ద్రవ్య లోటు పూడ్చడమనే సాకు తో లాభదాయకమైన ఎల్ఐసి సంస్థలో వాటాలు అమ్మటం దేశ ఆర్థిక కామధేనువు పొదుగు కోయటమే. దేశీయ పొదుపు పెరిగే చర్యలు, ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేసే ప్రత్యామ్నాయ విధానాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నదని సి. హెచ్. నరసింగరావు, అధ్యక్షులు,  ఎ.వి.నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *