-ప్లాస్టిక్ రహిత చల్లపల్లితో కృష్ణా జిల్లాకు ఆదర్శం సృష్టిద్దాం
-ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యం
-జిల్లా కలెక్టర్ డీకే బాలాజి
చల్లపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారోగ్య పరిరక్షణ, పర్యావరణ సంరక్షణ లక్ష్యంగా సెప్టెంబరు 1 నుంచి చల్లపల్లి గ్రామంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజి ప్రకటించారు.
బుధవారం చల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, దుకాణదారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో వ్యాపారులందరితో కలెక్టర్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా విరమించుకునేలా ప్రతిజ్ఞ చేయించారు.
చల్లపల్లి నుంచే మార్పుకు నాంది పలకాలని, గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ కప్పులు తదితర వస్తువుల వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని సూచించారు. మైక్రో ప్లాస్టిక్ కారణంగా ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు పెరుగుతోందని పేర్కొన్న కలెక్టర్, ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చేతి సంచి తీసుకెళ్లే అలవాటు చేసుకోవాలని సూచించారు. గ్రామంలో భవిష్యత్తులో వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
వ్యాపారుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సెప్టెంబరు 1 నుంచి నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు. అప్పటి వరకు వ్యాపారులు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్ నిల్వలను వినియోగించుకోవచ్చని, అయితే నిషేధం అమల్లోకి వచ్చిన అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వినియోగాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
టీ దుకాణాలు, హోటళ్లలో తప్పనిసరిగా గాజు గ్లాసులనే వినియోగించాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై జరిమానాలతో పాటు అవసరమైతే విద్యుత్, తాగునీటి సరఫరా నిలిపివేత వంటి కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే చర్యలు చేపడతామని తెలిపారు.
గ్రామంలో విస్తృతంగా మైక్ ప్రచారం నిర్వహించాలని, గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి వ్యాపారికి నిషేధంపై అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ నిషేధాన్ని భారంగా కాకుండా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
జిల్లా పంచాయతీ అధికారిణి ఎం ధనలక్ష్మి మాట్లాడుతూ, ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జరిమానాలు విధించే పరిస్థితి రాకుండా వ్యాపారులు స్వచ్ఛందంగా నిబంధనలు పాటించాలని సూచించారు. అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని అన్నారు.
స్వచ్ఛ చల్లపల్లి సారథి, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ డాక్టర్ డి.ఆర్.కె. ప్రసాద్ మాట్లాడుతూ, కృష్ణా జిల్లాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దే జిల్లా కలెక్టర్ ప్రయత్నాలకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయాలని సూచిస్తూ, భవిష్యత్ తరాల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కార్యక్రమంలో డీఎల్పీవో ఎం.డి. రాజావుల్లా, ఖాదీ బోర్డు సహాయ సంచాలకులు సత్యనారాయణ, పారిశ్రామికవేత్త కృష్ణప్రసాద్, తహసీల్దార్ వనజాక్షి, డాక్టర్ పద్మావతి, గ్రామ పంచాయతీ కార్యదర్శి పి.వి. మాధవేంద్రరావు, వర్తక సంఘం ప్రతినిధులు, వివిధ వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News