Breaking News

మధ్యవర్తిత్వంతో వివాదాలకు త్వరితగతిన పరిష్కారం – జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి

-మీడియేషన్ ఫర్ నేషన్ 3.0’ను విజయవంతం చేయాలి – సెప్టెంబర్ 12 నేషనల్ లోక్ అదాలత్‌కు విస్తృతంగా కేసులు రిఫర్ చేయాలని సూచన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించి ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో మధ్యవర్తిత్వం (మీడియేషన్) అత్యంత ప్రభావవంతమైన ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విధానమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) చైర్‌పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గుట్టాల గోపి అన్నారు. ప్రతి న్యాయమూర్తి రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి, నేషనల్ లోక్ అదాలత్‌కు విస్తృతంగా రిఫర్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

బుధవారం సాయంత్రం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్‌లో నిర్వహించిన “మీడియేషన్ ఫర్ నేషన్ 3.0” ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జాతీయ న్యాయ సేవా సంస్థ (NALSA) ఆధ్వర్యంలో చేపట్టిన “మీడియేషన్ ఫర్ నేషన్ 3.0” కార్యక్రమం ప్రజల్లో మధ్యవర్తిత్వంపై అవగాహన పెంపొందించడం, కోర్టు వివాదాలను రాజీ మార్గంలో పరిష్కరించడం, న్యాయవ్యవస్థపై భారాన్ని తగ్గించి ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే లక్ష్యమని తెలిపారు. గతంలో నిర్వహించిన మీడియేషన్ 1.0, 2.0 కార్యక్రమాలు విజయవంతమయ్యాయని, ప్రస్తుతం జరుగుతున్న 3.0 కార్యక్రమాన్ని కూడా అదే స్థాయిలో విజయవంతం చేయాలని కోరారు.

కృష్ణా జిల్లాలో ప్రస్తుతం 99 మంది శిక్షణ పొందిన మీడియేటర్లు అందుబాటులో ఉన్నారని, వివిధ స్థాయిల న్యాయమూర్తులకు కూడా మీడియేషన్‌పై ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు. భవిష్యత్తులో అవసరమైన సందర్భాల్లో న్యాయమూర్తులు కూడా సమర్థవంతమైన మధ్యవర్తులుగా వ్యవహరించేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.

ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక ప్రచార వారంలో మీడియేటర్లకు వ్యక్తిత్వ వికాసం, ఓరియెంటేషన్ కార్యక్రమాలు, భాగస్వామ్య సంస్థలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం నిర్వహించిన అవగాహన ర్యాలీలో జిల్లాలోని అధిక సంఖ్యలో మీడియేటర్లు పాల్గొని ప్రజలకు మధ్యవర్తిత్వం యొక్క ప్రాధాన్యాన్ని వివరించారని చెప్పారు.

రిఫరల్ జడ్జిల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్న ఆయన, కొత్త విధానాలను న్యాయమూర్తులు ముందుగా స్వీకరించి సమర్థవంతంగా అమలు చేసినప్పుడే వాటి ఫలితాలు ప్రజలకు చేరుతాయని అన్నారు. “మీడియేషన్ ఫర్ నేషన్ 3.0” కార్యక్రమం డిసెంబర్ 30 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ప్రతి కోర్టు రాజీకి అవకాశం ఉన్న కేసులను గుర్తించి మధ్యవర్తిత్వానికి పంపాలని సూచించారు.

సెప్టెంబర్ 12న నిర్వహించనున్న నేషనల్ లోక్ అదాలత్‌ను విజయవంతం చేసేందుకు రాజీకి అవకాశం ఉన్న కేసులను ముందుగానే గుర్తించి లోక్ అదాలత్‌కు రిఫర్ చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, బీమా సంస్థలు, సంబంధిత విభాగాలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అధికారులకు సూచించారు. ప్రజలు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి టి. రాజా వెంకట్రాది, పదవ అదనపు జిల్లా జడ్జి సిహెచ్. దుర్గా పూర్ణిమ, కృష్ణా జిల్లా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ ఓ.వి. నాగేశ్వరరావు, కృష్ణాజిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎస్ .వరలక్ష్మి, మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు తుంగల హరిబాబు, పలువురు న్యాయవాదులు, న్యాయశాఖ సిబ్బంది పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్ & బీ శాఖ పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి సమీక్ష

-రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రహదారి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశం. -రూ.2,500 కోట్లతో చేపట్టిన 6,061 కి.మీ రహదారి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *