విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘మార్పు రావాలి – మార్పు కావాలి అనే నినాదంతో సిపిఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈనెల ఆరవ తేదీ నుండి 15వ తేదీ వరకు విజయవాడ నగర వ్యాప్తంగా జరగనున్న పాదయాత్రలను జయప్రదం చేయాలని సిపిఐ విజయవాడ నగర కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు పిలుపునిచ్చారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 46, 47, 48, 51 డివిజన్ల బాధ్యుల సమావేశం ఈరోజు కేఎల్ రావు పార్క్ వద్దగల కనకయ్య అప్పారావు గ్రంధాలయంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నగర కార్యవర్గ సభ్యులు డివి రమణబాబు, సింగరాజు సాంబశివరావు, యడ్ల కృష్ణ కిషోర్ లు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఐ సమరభేరి మోగించిందన్నారు. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు పరస్పరం బాకాలు ఊదుకుంటున్నారన్నారు. ప్రభుత్వాలు మారినప్పటికీ ప్రజల తలరాత మారడం లేదన్నారు. పేదవారు మరింత పేదలుగానే మిగిలిపోతున్నారన్నారు. గత ఎన్నికలకు ముందు పాలకులు ఇచ్చిన వాగ్దానాల అమలుకు నోచుకోకపోవడం విచారకరమన్నారు. పేదలకు విజయవాడ నగరంలో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించి, ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల చొప్పున మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కొండ ప్రాంతాల్లో రెవెన్యూ పట్టాలకు రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించాలని, బుడమేరు ముంపు నివారణకు నిర్దిష్ట చర్యలు చేపట్టాలని తదితర డిమాండ్లతో సిపిఐ పాదయాత్రలు నిర్వహిస్తున్నదన్నారు. ఈ పాదయాత్రలలో ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శులు, సహాయ కార్యదర్శులు కుర్రా శివకుమార్, కే వెంకటేశ్వరరావు, ఏ యేసు, కె గణేష్, కె ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News