-సూరంపల్లిలో ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
-రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే
-సూరంపల్లి అభివృద్ధికి ఇప్పటివరకు రూ.2.16 కోట్ల పనులు మంజూరు చేశాం: యార్లగడ్డ
-అదనంగా మరో రూ.55 లక్షల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశాం: ఎమ్మెల్యే
-గన్నవరం నియోజకవర్గంలో 9,600కు పైగా ప్రజా సమస్యలు పరిష్కరించాం: యార్లగడ్డ
-పంచాయతీ ఖాతాలో నిధులు ఉన్నా గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉంది: ఎమ్మెల్యే
-సూరంపల్లిలో పనిచేస్తున్న అధికారులపై చర్యలకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా: ఎమ్మెల్యే
-ప్రజా సమస్యలను గాలికొదిలే అధికారులను ఉపేక్షించేది లేదు: యార్లగడ్డ వెంకట్రావు
గన్నవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో నిర్వహించిన ‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే గన్నవరం నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. అనంతరం రూ.35 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తోందన్నారు. సూరంపల్లి గ్రామానికి ఇప్పటివరకు రూ.2.16 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్ మౌలిక వసతులు, పంచాయతీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయించినట్లు చెప్పారు. అదనంగా మరో రూ.55 లక్షల విలువైన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని వెల్లడించారు. గన్నవరం నియోజకవర్గంలో గత రెండేళ్లలో 9,600కు పైగా ప్రజా అర్జీలను పరిష్కరించామని, ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగా గన్నవరం, బాపులపాడు మండలాల్లో వందల ఎకరాల ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 40-50 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు ఇళ్ల పట్టాలు అందించామని, కొత్తపల్లి గ్రామంలోనే 200 పట్టాలు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. అయితే సూరంపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఖాతాలో సుమారు రూ.1.30 కోట్లు నిధులు ఉన్నప్పటికీ డ్రైనేజీల శుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, చెత్త తొలగింపు వంటి కనీస పనులు కూడా చేయకపోవడం బాధాకరమన్నారు. గ్రామంలో కొన్ని ప్రాంతాల్లో పాములు సంచరించే స్థాయిలో అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనడం అధికారుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. గ్రామంలో ప్రత్యేక అధికారి, ఈఓ పనితీరు అత్యంత నిరాశాజనకంగా ఉందని, ప్రజల సమస్యలను పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. శానిటరీ కార్మికులు ఎందుకు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదో సమాధానం చెప్పాలని అధికారులను నిలదీశారు. ప్రజల పన్నుల డబ్బుతో జీతాలు తీసుకుంటూ విధులను నిర్వర్తించకపోవడం ఏమాత్రం సహించబోమన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే అంశాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని, అవసరమైతే మెమోలు జారీ చేయించి బదిలీలు కూడా చేయిస్తానని హెచ్చరించారు. సూరంపల్లి గ్రామానికి గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 617 ఓట్ల మెజారిటీ వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి గ్రామాన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తన పై ఉందన్నారు. గ్రామంలో కళ్యాణ మండపం నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని, స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ పనిని చేపట్టేందుకు చర్చలు జరిపినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఇంటింటికీ తిరుగుతున్నామని, ఈ పర్యటనలోనే గ్రామంలోని అసలు పరిస్థితులు తన దృష్టికి వచ్చాయని చెప్పారు. ఇకపై గ్రామంలో పారిశుద్ధ్యం, డ్రైనేజీ, మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సూరంపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు స్థానిక ఎమ్మెల్యేగా తాను క్షమాపణ చెబుతున్నానని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నానని యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News