విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతర్జాతీయ ఐస్ మరియు రోలర్ స్కేటర్ పెదిరెడ్ల చైత్ర దీపిక వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రను బుధ వారం మర్యాదపూర్వకంగా కలిశారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని ఆయన చాంబర్లో కలి సిన ఆమెను కమిషనర్ అభినందించారు. ఈ సంద ర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ చైత్ర దీపిక భారతదేశం తరపున థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ నగరంలో 2026 జూలై 19 నుండి 25 వరకు నిర్వహించిన ఇంటర్నేషనల్ స్కేటింగ్ యూనియన్ (ISU) సింక్రో9 డెవలప్మెంట్ క్యాంప్‌లో విజయవంతంగా పాల్గొని, ISU సర్టిఫికేషన్‌ను సాధించటం అభి నందనీయమన్నారు. ఈ సర్టిఫికేట్ ద్వారా ఆమె అంతర్జాతీయ స్థాయి అభివృద్ధి శిబిరంలో పాల్గొన్నట్లు అధికారికంగా ధృవీకరించబడింది.
ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఎంపికైన ప్రతిభావంతులైన యువ స్కేటర్లకు ఈ శిక్షణా శిబిరంలో అంతర్జాతీయ స్థాయి కోచ్‌లు, సాంకేతిక నిపుణులు ప్రత్యేక శిక్షణ అందించారు. ఈ ప్రతిష్ఠాత్మక శిబిరానికి ఎంపిక కావడం, విజయవంతంగా పూర్తి చేయడం చైత్ర దీపిక ప్రతిభకు, కృషికి, అంతర్జాతీయ స్థాయిలో ఆమె సాధిస్తున్న గుర్తింపుకు నిదర్శనం. ఈ అంతర్జాతీయ సర్టిఫికేషన్ ఆమె క్రీడా జీవితంలో మరో విశిష్ట మైలురాయిగా నిలిచింది. భవిష్యత్తులో జరగనున్న అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్ పోటీలకు, ముఖ్యంగా ISU ఆధ్వర్యంలోని ఉన్నత స్థాయి పోటీలకు ఈ శిక్షణ ఎంతో దోహదపడనుంది. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఇప్పటికే పలు పతకాలు సాధించి భారతదేశానికి గౌరవం తీసుకువచ్చిన చైత్ర దీపిక, ఈ తాజా ISU సర్టిఫికేషన్‌తో మరో అరుదైన విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఆమె ఈ విజయం యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర పేర్కొన్నారు. ఆమెకు అండగా నిలిచిన టీం ఇండియా రోలర్ స్కేటింగ్ కోచ్‌లు అనూప్ కుమార్ యమా, పి. సత్యనారాయణ, ఫిట్నెస్ కోచ్ రామ్మోహన్, స్నేహితులు, ప్రవాసాంధ్రులు మరియు అభిమానులు చైత్రదీపికకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News