-పార్లమెంటులో తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రశ్నతో వెలుగులోకి వాస్తవాలు
న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గత మూడేళ్లుగా పరిశోధన రంగంలో విదేశీ పెట్టుబడులు లేవని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర శాస్త్ర సాంకేతిక, భూవిజ్ఞాన శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా తిరుపతిలో పరిశోధన, అభివృద్ధి రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత మేరకు వచ్చాయి, కొత్త పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నాయా, రాష్ట్రంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటని ఎంపీ ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, గత మూడు ఆర్థిక సంవత్సరాలలో ఆంధ్రప్రదేశ్‌కు పరిశోధన రంగంలో ఎలాంటి విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు నమోదు కాలేదని స్పష్టం చేశారు. అయితే, రాష్ట్రానికి మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం గణనీయంగా పెరిగాయి. గత మూడు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం 933.86 మిలియన్ అమెరికన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. పరిశోధన రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్, సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్, బయో-ఇ3 పాలసీ, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని సమాధానంలో పేర్కొంది.
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, తిరుపతిలో కానీ ప్రత్యేకంగా విదేశీ నిధులతో కొత్త పరిశోధన కేంద్రాలు, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఇన్నోవేషన్ హబ్‌ల ఏర్పాటు కోసం ఇప్పటివరకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా కొత్త కేంద్ర ప్రభుత్వ పరిశోధన సంస్థ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదన ప్రస్తుతం లేదని తెలిపింది. అయితే ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి వంటి సంస్థలకు కేంద్ర ప్రభుత్వ పరిశోధన కార్యక్రమాల ద్వారా కొనసాగుతున్న మద్దతు అందుతున్నట్లు వెల్లడించింది.
ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ, రాష్ట్రానికి మొత్తం విదేశీ పెట్టుబడులు పెరగడం సంతోషకరమైన విషయమే అయినప్పటికీ, పరిశోధన మరియు ఆవిష్కరణల రంగంలో గత మూడు సంవత్సరాలుగా ఒక్క విదేశీ పెట్టుబడి కూడా రాకపోవడం ఆందోళన కలిగించే అంశమన్నారు. తిరుపతిలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఎస్ఈఆర్ వంటి జాతీయ స్థాయి విద్యా, పరిశోధన సంస్థలు ఉన్నందున, ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ స్థాయి పరిశోధన మరియు ఆవిష్కరణల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఎంపీ గురుమూర్తి కోరారు. అలాగే విదేశీ కంపెనీలు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు రూపొందించాలని సూచించారు.
Prajavartha Online Telugu News