అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్ని కుల క్షత్రియుల జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని నేడు(శుక్రవారం) రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. పొనమ్మండ లక్ష్మణస్వామివర్మ రాష్ట్ర స్థాయి జయంతిని కాకినాడ జిల్లా కోరింగలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నికులక్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి పొన్నమండ లక్ష్మణ స్వామి విశేష కృషి చేశారన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్రస్థాయి మహాసభను నిర్వహించి, ఆ సామాజిక వర్గీయులను ఒకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే 1927లో జీవో నెం. 271 ద్వారా అగ్నికుల క్షత్రియులు అనే అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని అధికారిక రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. భావి తరాలకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు తెలియజేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామన్నారు. పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకోవడంపై మంత్రి సవిత హర్షం వ్యక్తంచేశారు. బీసీల మనోభావాలకు గౌరవమిస్తూ ఆయా వెనుకబడిన వర్గాలకు చెందిన మహానీయుల సేవలను కొనియాడుతూ, వారి జయంతలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తూ వస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
Prajavartha Online Telugu News