Breaking News

ఓటు హక్కు పొందడం ప్రతి అర్హుడి బాధ్యత

-అవసరమైన ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసి ఓటరుగా నమోదు కావాలి
-క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు ఆగస్టు 30 వరకు గడువు
-సెప్టెంబర్ 28 నాటికి క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హులైన ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని, ఓటరుగా నమోదు కావడం ప్రతి ఒక్కరి రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ సమర్థవంతంగా అమలవుతున్న తీరును జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. నందిగామ పట్టణ పరిధిలో క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిశీలనకు జారీ చేస్తున్న నోటీసులను పరిశీలించారు. బీఎల్‌వోలు ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తూ, ప్రతి దరఖాస్తును నిబంధనల ప్రకారం స్వీకరించి సకాలంలో విచారణ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితాను జూలై 31, 2026న విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఏదైనా కారణంతో ఓటరు జాబితాలో పేరు నమోదు కాకపోయినా, లేదా పేరు తొలగించబడినా, అర్హులైన వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత బీఎల్‌వోను సంప్రదించి అవసరమైన ధ్రువపత్రాలతో క్లెయిమ్‌లు, అభ్యంతరాలు దాఖలు చేసుకోవాలని సూచించారు. సమర్పించిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నోటీసులు జారీ చేసి, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ నిర్వహించిన అనంతరం అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని తిరిగి ఓటర్ల జాబితాలో నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ప్రతి దరఖాస్తును పారదర్శకంగా పరిశీలించి నిబంధనల మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాల దాఖలుకు ఆగస్టు 30, 2026 వరకు గడువు ఉందని కలెక్టర్ వెల్లడించారు. అందిన అన్ని దరఖాస్తులను పరిశీలించి సెప్టెంబర్ 28, 2026 నాటికి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. గడువు ముగిసేలోపు అర్హులైన ప్రతి ఒక్కరూ తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు. గతంలో ఓటరుగా నమోదై ఉండి, ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేకపోయిన వారు భారత ప్రభుత్వం నిర్దేశించిన 11 ఆమోదిత ధ్రువపత్రాల్లో ఏదో ఒకటి ఆధారంగా సమర్పించి తమ అభ్యంతరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సరైన ఆధారాలతో దరఖాస్తు చేస్తే నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హత ఉన్న వారికి ఓటరు హక్కు కల్పిస్తామని తెలిపారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి భారత పౌరుడు ఓటరు హక్కుకు అర్హుడని పేర్కొన్న కలెక్టర్, అర్హులైన యువత సంబంధిత ధ్రువపత్రాలతో ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకుని తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో ఎ.అనిల్ కుమార్, తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, మున్సిపల్ కమిషనర్ లోవరాజు, ఎంపీడీవో వరప్రసాద్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *