Breaking News

జిల్లాలో ఎరువులకు కొరత లేదు – రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు

-శ్రీ మణికంఠ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్‌లో అకస్మిక తనిఖీ – ఎరువుల పంపిణీ విధానంపై క్షుణ్ణంగా పరిశీలన
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ పట్టణంలోని శ్రీ మణికంఠ సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ దుకాణాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ గురువారం ఆకస్మికంగా సందర్శించి ఎరువుల పంపిణీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందుతున్నాయా, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలపై స్వయంగా తనిఖీ నిర్వహించారు. దుకాణంలో రైతులకు అవసరమైన హెల్ప్‌లైన్ నంబర్లు, ఎరువుల ధరల పట్టికలు స్పష్టంగా ప్రదర్శించారా లేదా అని పరిశీలించారు. అలాగే ఎరువులు కొనుగోలు చేస్తున్న రైతులు సంబంధిత పంట నమోదును పూర్తి చేసుకున్నారా అనే విషయాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఏపీఏఐఎంఎస్ (APAIMS) యాప్ ద్వారా కేటాయించిన ఎరువుల వివరాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రైతుకు ఉన్న సాగుభూమి విస్తీర్ణం, పంట నమోదు, అర్హత మేరకు యూరియా, డీఏపీ వంటి ఎరువుల కేటాయింపు, ఇప్పటికే పొందిన పరిమాణం, ఇంకా పొందాల్సిన నిల్వ తదితర వివరాలను యాప్‌లో పరిశీలిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేదని స్పష్టం చేశారు. ఎవరూ ఎరువుల కోసం క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదన్నారు. ఏపీఏఐఎంఎస్ యాప్‌లో నమోదు చేసుకున్న ప్రతి రైతు తన అర్హత మేరకు ఎప్పుడైనా ఎరువులు పొందవచ్చని తెలిపారు. ప్రతి రైతుకు ప్రభుత్వం కేటాయించిన ఎరువుల కోటా ఆయా రైతులకే కేటాయింపుగా ఉంటుందని, ఒకేసారి తీసుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైన సమయంలో తమ కోటా మేరకు ఎరువులు పొందవచ్చని వివరించారు. రైతులు అవసరానికి మించి రసాయన ఎరువులు వినియోగించరాదని జిల్లా కలెక్టర్ సూచించారు. అధిక ఎరువుల వినియోగం వల్ల పంటలు, భూసారం, పర్యావరణం, అలాగే ఆహారాన్ని వినియోగించే ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని చెప్పారు. శాస్త్రీయ ప్రమాణాల ప్రకారం ఒక ఎకరాకు అవసరమైన పరిమాణంలో మాత్రమే ఎరువులు వినియోగించాలని రైతులకు సూచించారు. పచ్చిరొట్ట పంటలు సాగు చేయడం ద్వారా భూసారం పెరిగి, రసాయన ఎరువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే పంట మార్పిడి విధానాన్ని పాటించడం ద్వారా భూమి సారవంతంగా ఉండటంతో పాటు రైతులకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏలినినో ప్రభావం ఉన్న నేపథ్యంలో రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను నివారించడంతో పాటు లాభదాయకమైన వ్యవసాయం చేయవచ్చన్నారు.

రాఘవాపురంలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

అనంతరం రాఘవాపురం గ్రామంలో సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్న పంట పొలాలను జిల్లా కలెక్టర్ సందర్శించి రైతులతో నేరుగా మాట్లాడారు. పంటల దిగుబడి, సాగు విధానాలు, మార్కెట్ అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు. రైతులు బ్యాంకుల ద్వారా పంట రుణాలు తీసుకున్నారా అనే విషయంపై కూడా ఆరా తీశారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వినియోగించకుండా పండించిన కూరగాయలు, ఆహార ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు రుచికరంగా ఉండటంతో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయని పేర్కొన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రజలు రైతులు పండించిన సేంద్రియ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతులు కూడా ప్రతి ఏడాది సేంద్రియ సాగు విస్తీర్ణాన్ని పెంచుతూ ప్రకృతి వ్యవసాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

ఈ పర్యటనలో నందిగామ ఆర్డీవో ఎ.అనిల్ కుమార్, తహసీల్దార్ నూతక్కి సురేష్ బాబు, ఎంపీడీవో వరప్రసాద్, ఏపీవో శరత్ బాబు, రెవెన్యూ సిబ్బంది, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తిరుపతిలో జవహర్ నవోదయ విద్యాలయ ఏర్పాటు వేగవంతం చేయండి

-కేంద్ర పాఠశాల విద్యా కార్యదర్శిని కోరిన తిరుపతి ఎంపీ గురుమూర్తి న్యూఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *