-ప్రమాద బాధితులకు గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స
-ప్రమాదం జరిగిన గంటలోపు ఆసుపత్రికి చేర్చిన వారికి ‘గుడ్ సమారిటన్’గా రూ.25,000 ప్రోత్సాహకం
-గుడ్ సమారిటన్లకు న్యాయపరమైన ఇబ్బందులు ఉండవు — బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి వెళ్లిపోవచ్చు
-జిల్లాలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరింత తగ్గించేందుకు సమన్వయంతో చర్యలు
-బ్లాక్ స్పాట్లను గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టాలి
-నడిచివెళ్లేవారు, ద్విచక్ర వాహనదారులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు – రహదారి భద్రతపై విస్తృత అవగాహన అవసరం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి.రాజశేఖర్ బాబు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు తక్షణ వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పి.ఎం. రాహత్ పథకంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ప్రమాద బాధితుడికి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉందని, అత్యవసర సమయంలో డబ్బు కోసం వేచి ఉండకుండా బాధితుడికి తక్షణ వైద్యం అందేలా ఈ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధ్యక్షతన మంగళవారం జిల్లాస్థాయి రహదారుల భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.పురేంద్ర, కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
* ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు నగదు రహిత చికిత్స
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి వెంటనే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స అందించేందుకు పి.ఎం. రాహత్ పథకంను కేంద్ర ప్రభుత్వం 2026 ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకం కింద ప్రతి ప్రమాద బాధితుడికి గరిష్ఠంగా రూ.1,50,000 వరకు నగదు రహిత చికిత్స అందించే అవకాశం ఉందన్నారు. పథకం నిబంధనల ప్రకారం ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్ఠంగా 7 రోజుల వరకు ఈ వైద్య ప్రయోజనం వర్తిస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడికి అవసరమైన అత్యవసర వైద్య సేవలు అందేలా చూడటమే పథకం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. డబ్బు లేకపోవడం వల్ల అత్యవసర చికిత్స ఆలస్యం కాకుండా చూడటంతో పాటు, ప్రమాద బాధితుడి ప్రాణాలను కాపాడేందుకు తక్షణ వైద్య సహాయం అందేలా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు.
* గుడ్ సమారిటన్లకు రూ.25,000 ప్రోత్సాహకం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తక్షణ సహాయం అందించి, ప్రమాదం జరిగిన ఒక గంటలోపు ఆసుపత్రికి చేర్చే వ్యక్తిని ‘గుడ్ సమారిటన్’గా గుర్తించడం జరుగుతుంది అన్నారు. ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించడం, అంబులెన్స్ లేదా పోలీసులకు సమాచారం అందించడం, అవసరమైన అత్యవసర సహాయం అందించడం వంటి చర్యలు చేపట్టే వ్యక్తులు ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. అర్హత కలిగిన గుడ్ సమారిటన్కు ప్రభుత్వం రూ.25,000 ప్రోత్సాహకం అందించే అవకాశం ఉందని తెలిపారు. ప్రమాద బాధితుడికి సహాయం చేయడానికి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. సదుద్దేశంతో ప్రమాద బాధితుడికి సహాయం చేసే గుడ్ సమారిటన్లకు అనవసరమైన న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని తెలిపారు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్చి అవసరమైన సమాచారాన్ని అందించిన తర్వాత గుడ్ సమారిటన్ అక్కడి నుంచి వెళ్లిపోవచ్చని, ప్రమాద బాధితుడికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
2026 జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 583 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ప్రమాదాల సంఖ్య 13.5 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగడానికి ముందే కారణాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం అత్యంత ముఖ్యమన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన ఇంజినీరింగ్, ట్రాఫిక్, పోలీసు చర్యలను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్ స్పాట్లను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో రహదారి పరిస్థితులు, వెలుతురు, సిగ్నలింగ్, ట్రాఫిక్ నియంత్రణ, వేగ నియంత్రణ వంటి అంశాలను పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఈ సమయాల్లో ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు వీఎంసీ, రవాణా, ఫైర్, పోలీస్ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు, ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టడం అధికారుల బాధ్యత అన్నారు. నగరంలోని ఒక హోటల్ వద్ద పార్కింగ్ కారణంగా ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే విధంగా పార్కింగ్ నిర్వహిస్తున్న సదరు హోటల్ ట్రేడ్ లైసెన్స్‌ను నిబంధనల మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. ప్రమాదాల నివారణకు పోలీసు, రవాణా, మున్సిపల్, ఆర్అండ్బీ, ఎన్హెచ్ఏఐ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని, రహదారి భద్రతను సామూహిక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి: కమిషనర్ ఆఫ్ పోలీస్
కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.వి. రాజశేఖర్ బాబు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీవ్రంగా నష్టపోతున్నాయని, ఇది ఎంతో బాధాకరమైన విషయమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ రహదారి భద్రతా నిబంధనలను పాటించాలని సూచించారు. ప్రత్యేకంగా నడిచి వెళ్లేవారు, రహదారులు దాటేవారు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేవారు, వృద్ధులు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. వీరి భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కంచికచర్ల ప్రాంతాల్లో ప్రమాదాలపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో జరిగిన ప్రమాదాల్లో ఇబ్రహీంపట్నం ప్రాంతంలోనే 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో సరైన వెలుతురు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నట్లు తెలుస్తోందని, ఆయా ప్రాంతాల్లో తగిన లైటింగ్ సదుపాయాలు కల్పించేందుకు సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని 17 ప్రాంతాల్లో సిగ్నల్ లైట్లు ప్రస్తుతం వినియోగంలో ఉన్నాయని, మరో 25 ప్రాంతాల్లో సిగ్నల్ లైట్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయని సమావేశంలో వివరించారు. దసరా నాటికి అన్ని ప్రధాన కూడళ్లలో సిగ్నల్ లైట్లు పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2022 సంవత్సరం నుంచి 2026 ఆగస్టు వరకు జిల్లాలో 344 హిట్ అండ్ రన్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. వీటిలో 273 కేసులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.2.32 కోట్ల పరిహారం చెల్లించినట్లు పేర్కొన్నారు. ఇంకా 40 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నిబంధనల ప్రకారం త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రహదారి భద్రతకు నిరంతర చర్యలు: డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎం.పురేంద్ర మాట్లాడుతూ, రహదారుల భద్రతకు సంబంధించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలను కమిటీ సభ్యులకు వివరించారు. రహదారి భద్రత అనేది ఒక్క ప్రభుత్వ శాఖలకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు.
ఈ సమావేశంలో ఎన్హెచ్ఏఐ విజయవాడ పీడీ ఎం.విద్యాసాగర్, రోడ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రంశెట్టి అంజిబాబు, పోలీసు, రవాణా, మెడికల్ అండ్ హెల్త్, వీఎంసీ తదితర శాఖల అధికారులు, కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News