-ఆర్బిట్రేషన్ సెంటర్ కూడా ఏర్పాటు
-ఏవో పోస్టు భర్తీకి కేబినెట్ ఆమోదం
-సత్వర న్యాయ సేవల విస్తృతం కోసం చర్యలు
-న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టులో మీడియేషన్ సెంటర్ మరియు ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు మంత్రివర్గ సమావేశం లో ఆమోద ముద్ర వేయడం జరిగిందని న్యాయ, మైనారిటీ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మంగళవారం వెలగపూడి సచివాలయం లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో న్యాయ శాఖకు సంబంధించిన రెండు కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర వేసిన విషయాలను మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. 14 మంది సిబ్బందితో మీడియేషన్ సెంటర్ తో పాటుగా 15 మంది సిబ్బందితో ఆర్బీట్రేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేయడం జరిగిందన్నారు.హైకోర్టులో పరిపాలన సౌలభ్యం కోసం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఓ )పోస్టును డైరెక్టరేట్ ఆఫ్ ప్రిజన్స్ క్రింద పనిచేస్తున్న పీపీ లేదా ఏపీపీ ద్వారా డిప్యుటేషన్ పై భర్తీ చేయడానికి కూడా మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపిందని మంత్రి ఫరూక్ తెలిపారు.రాష్ట్రంలో న్యాయ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి, విస్తృత చర్యలు తీసుకోవడంలో భాగంగా పరిపాలనాపరంగా కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు.పెండింగ్ కేసుల పరిష్కారానికి, సత్వర న్యాయానికి ప్రత్యేకంగా దృష్టి సారించి న్యాయ శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు. ఇప్పటికే హైకోర్టులో “రిజిస్ట్రార్” ( కోర్టు కేస్ అండ్ మేనేజ్మెంట్ )పోస్టు సృష్టికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)చట్టం కింద నమోదయ్యే కేసుల విచారణ కోసం విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశామన్నారు. న్యాయ సేవలను విస్తృతం చేయడం ద్వారా న్యాయ స్థానాలలో పెండింగ్ కేసులను తగ్గించేదుకు వీలు కలుగుతుందని న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News