-రాష్ట్ర బీసీ సంక్షేమ సవిత
-రాష్ట్రంలో రూ.6.86 కోట్లతో 2 ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటు
-అమలాపురంలో బాలురు, తిరుపతిలో బాలికల సెంటర్లు
-ఫస్ట్ , సెకండర్ ఇంటర్ లో 160 మంది చొప్పున 320 మందికి శిక్షణ
-ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఫస్ట్ ఇంటర్ తరగతులు ప్రారంభం
-ఎక్స్ లెన్స్ సెంటర్ల ఏర్పాటుపై మంత్రి సవిత హర్షం
-సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి ధన్యవాదాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బీసీ విద్యార్థులు ఐఐటీ – జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటేలా కూటమి ప్రభుత్వం రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒక్కో కేంద్రం ద్వారా 320 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. రూ.6.86 కోట్లతో ఈ రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ బిడ్డల విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. బీసీ గురుకులాలు, హాస్టళ్ల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోందన్నారు. టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ మార్కులతో సత్తాచాటుతున్న బీసీ విద్యార్థులకు ఉన్నత విద్య అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రెండు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఈ కేంద్రాల ద్వారా ఐఐటీ – జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో సత్తా చాటేలా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యాసంస్థల సంఘం ఆధ్వర్యంలో ఈ రెండు కేంద్రాలను అమలాపురం, తిరుపతిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అమలాపురంలో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ కేంద్రంలో బాలురకు, తిరుపతిలో బాలికలకు శిక్షణ ఇవ్వనున్నామన్నారు. త్వరలో ఇంటర్ మొదటి సంవత్సరంలో 160 మంది విద్యార్థులకు అడ్మిషన్లు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఎంపీసీలో 80 మంది, బైపీసీలో 80 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎంజేసీ గురుకుల విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులను ఎక్స్ లెన్స్ సెంటర్ కు ఎంపిక చేయనున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా బీసీ విద్యార్థులు ఐఐటీ – జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఎయిమ్స్,ఇతర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో అధిక సంఖ్యలో ప్రవేశాలు సాధించేలా అవకాశాలు కల్పించడమే ఈ శిక్షణా కేంద్రాల ఏర్పాటు ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర బీసీ సంక్షేమ సవిత తెలిపారు. ఈ రెండు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.6.86 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించనున్నామన్నారు. బీసీ బిడ్డల ఉన్నత విద్యకు ప్రోత్సహిస్తున్న సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు, మంత్రి నారా లోకేశ్ కు మంత్రి సవిత ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News