-స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల దిశగా కేబినెట్ నిర్ణయం హర్షణీయం
-బీసీలు ఓటు బ్యాంకు కాదు… తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి వెన్నెముక: అనిత
-ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న మంత్రివర్గ సమావేశంలో భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా ఉంది: అనిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం బీసీల రాజకీయ సాధికారతలో చారిత్రాత్మక అడుగు అని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడంలో తాను కూడా భాగస్వామిని కావడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు.
“బీసీలు కేవలం ఓటు బ్యాంకు కాదు… తెలుగుదేశం పార్టీకి, కూటమికి మొదటి నుంచి వెన్నెముక. పార్టీ కష్టకాలంలోనూ జెండాను వదలకుండా, ఎండనక–వాననక గడపగడపకూ తిరిగి పార్టీని ప్రజల్లో నిలబెట్టిన బీసీ కార్యకర్తలకు రాజకీయంగా సముచిత గౌరవం, అవకాశాలు కల్పించాలన్నదే మా ప్రభుత్వ సంకల్పం” అని పేర్కొన్నారు.
“నిన్నటి వరకు పార్టీ కోసం జెండా మోసిన సామాన్య బీసీ కార్యకర్త… రేపు అదే గ్రామంలో సర్పంచ్‌గా, ఎంపీటీసీగా, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా ప్రజలకు నాయకత్వం వహించాలి. బీసీలకు అవకాశాలు కల్పించడమే కాదు… వారిని అధికారంలో భాగస్వాములను చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి లక్ష్యం” అని అనిత తెలిపారు.
స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న 24.15 శాతం బీసీ రిజర్వేషన్లను 34 శాతానికి పెంచుతామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే బీసీల రాజకీయ ఎదుగుదలకు పెద్దపీట వేసిందని, స్వర్గీయ ఎన్టీఆర్ బీసీలకు రాజకీయ గుర్తింపు, అవకాశాలు కల్పిస్తే… అదే స్ఫూర్తితో సీఎం చంద్రబాబు బీసీలను నాయకత్వ స్థానాల్లో నిలబెడుతున్నారని పేర్కొన్నారు.
“బీసీల సంక్షేమం అంటే కేవలం పథకాలు, ఆర్థిక సహాయం మాత్రమే కాదు. రాజకీయంగా నిర్ణయాలు తీసుకునే స్థానాల్లో వారిని కూర్చోబెట్టడమే నిజమైన సాధికారత. జెండా మోసిన చేతులకే అధికార బాధ్యతలు అప్పగించే ఈ చారిత్రాత్మక నిర్ణయంలో మంత్రివర్గ సహచరురాలిగా భాగస్వామిని కావడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని హోంమంత్రి అనిత అన్నారు.
బీసీల ఆత్మగౌరవాన్ని మరింత పెంచే ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌తో పాటు మంత్రివర్గ సహచరులకు హోంమంత్రి వంగలపూడి అనిత ధన్యవాదాలు తెలిపారు.
Prajavartha Online Telugu News