Breaking News

తుంగభద్ర నీటిపై సమగ్ర సమీక్ష.

-రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలు, సిఈలతో సమావేశం.
-2027 జూలై వరకు సీమ ప్రజలకు తాగునీటి కొరత రాకుండా చర్యలు.
-జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత, రాయలసీమ ప్రాంత తాగునీటి అవసరాలు, ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ నీటి కేటాయింపులు, వినియోగంపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష నిర్వహించారు. రాయలసీమ ప్రాంత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, సిఈలు, తుంగభద్ర డ్యాం ఇంజనీర్ల తో జరిగిన ఈ సమీక్షలో ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో రాయలసీమలో తాగునీటి అవసరాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. 2027 జూలై వరకు రాయలసీమ ప్రాంతంలో తాగునీటి ఎద్దడి రాకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని చెప్పారు.

తుంగభద్ర డ్యాంలో నీటి లభ్యత, రాష్ట్రాల వాటాలపై చర్చించారు. తుంగభద్ర నీటిలో కర్ణాటక వాటా 65.56 శాతం, ఆంధ్రప్రదేశ్ వాటా 31.36 శాతం, తెలంగాణ వాటా 3.07 శాతంగా ఉందని తెలిపారు. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ఏడాది తుంగభద్ర డ్యాంకు సుమారు 105 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటాగా సుమారు 32.9 టీఎంసీలు అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ వాటాలో హెచ్‌ఎల్‌సీకి 11.88 టీఎంసీలు, ఎల్‌ఎల్‌సీకి 16.09 టీఎంసీలు, కే.సీ. కెనాల్‌కు 4.95 టీఎంసీలు కేటాయింపుగా ఉంటాయని అధికారులు వివరించారు. పరిమితంగా లభించే నీటి వనరులను అత్యంత పొదుపుగా వినియోగించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వాటాగా లభించే స్వల్ప నీటి నిల్వలను ప్రధానంగా తాగునీటి చెరువులు నింపడానికి మాత్రమే వినియోగించాలి అని స్పష్టం చేశారు.

ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి లభ్యతపై అనిశ్చిత పరిస్థితులు ఉండే అవకాశం ఉన్నందున ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ నీటి నిర్వహణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం సమర్థవంతమైన వాటర్ మేనేజ్‌మెంట్‌తో రాయలసీమ ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముందుచూపు లేకుండా నీటిని వినియోగిస్తే రిజర్వాయర్లలో నిల్వలు ఉండవని అన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించి అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్షాలపై కూడా ఉందని మంత్రి అన్నారు. అయితే ప్రజలను తప్పుదోవ పట్టించేలా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరికాదని సూచించారు.

ఎల్‌నినో నేపథ్యంలో 2027 జూలై వరకు తాగునీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రం సూచించిన పరిస్థితుల్లో, రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో నీటి నిర్వహణ చేపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. రాయలసీమ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని, అందుబాటులో ఉన్న నీటిని ప్రాధాన్యతా క్రమంలో వినియోగిస్తూ ప్రజలకు తాగు నీటి భద్రత కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే లు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, జే సి అస్మిత్ రెడ్డి, బండారు శ్రావణి, బొగ్గుల దస్తగిరి, దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, జయ నాగేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ బి టి నాయుడు, ఆలూరు ఇంచార్జి వైకుంఠం జ్యోతి, మంత్రాలయం ఇంచార్జి రాఘవేంద్ర రెడ్డి, ఆధోని టిడిపి ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, ఇరిగేషన్ సలహాదారులు ఎం. వెంకటేశ్వర రావు, ఈఎన్సి లు నరసింహ మూర్తి, వర ప్రసాద్, కర్నూలు సిఈ కబీర్ భాషా, తుంగభద్ర డ్యాం సిఈ నారాయణ నాయక్, కడప సిఈ బాల చంద్ర రెడ్డి, మరియు ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ASSOCHAM ప్రతిష్ఠాత్మక “బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్” అవార్డును అందుకున్న APMDC

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *