-విజయవాడ ఏ ప్లస్ కన్వెన్షన్ లో వైభవంగా ‘వెండితెర – ఓటీటీ అవార్డ్స్ 2025-26’.. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో కళలను, కళాకారులను ప్రోత్సహించడంతో పాటు చిత్ర పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. విజయవాడలోని ఏ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో ‘విబి ఎంటర్టైన్మెంట్స్’ ఆధ్వర్యంలో ‘సేవ్ ఆర్టిస్ట్ – సేవ్ టాలెంట్’ పేరుతో నిర్వహించిన “వెండితెర మరియు ఓటీటీ అవార్డ్స్ 2025-26” కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు పురస్కారాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడూతూ… విజయవాడ మొదటి నుంచీ సాంస్కృతిక, సినీ వ్యాపార రంగానికి అనుకూల ప్రాంతమని, ఇక్కడి నుంచి ఎందరో గొప్ప నటులు, సాంకేతిక నిపుణులు చిత్రసీమకు వెళ్లి ఉన్నత స్థానాలకు చేరుకున్నారని కొనియాడారు.ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు జరుపుకునే చిత్రాలకు ఉచితంగా, సింగిల్ విండో విధానం ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అద్భుతమైన లొకేషన్లు ఉన్నాయని, ఇక్కడ డబ్బింగ్ థియేటర్లు, రికార్డింగ్ థియేటర్లు, రీ రికార్డింగ్ థియేటర్ల ఏర్పాటుకు నిర్మాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ నిర్మాతలను ఈ విషయమై చర్చలు జరిపామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, స్వయాన కళాకారుడైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో సినీ పరిశ్రమను విస్తరింపజేస్తామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చే వారికి భూ కేటాయింపులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్ తరహాలోనే విజయవాడలోనూ తరచూ సినీ ఈవెంట్లు, అవార్డు వేడుకలు నిర్వహించాలని, ప్రతి ఏటా ఈ అవార్డుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాలని నిర్వాహకులకు సూచించారు.
మంత్రి కందుల దుర్గేష్ పట్టుదల, చొరవ వల్ల ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని వేడుకకు హాజరైన సినీ ప్రముఖులు ప్రశంసించారు. మన సంస్కృతిని పరిరక్షిస్తూ, యువ కళాకారుల కలలకు ప్రాణం పోయడమే ఈ అవార్డుల ప్రధాన ఉద్దేశమని విబి ఎంటర్టైన్మెంట్స్ నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ నిర్మాతగా, శరత్ దర్శకత్వంలో విక్రమ్, శ్రీ గాయత్రి నటీనటులుగా పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కిన “ఉత్తరం”సినిమా సాంగ్ ను లాంచ్ చేశారు..మ్యూజిక్ డైరెక్టర్ మహిమదన్ మ్యూజిక్ బాగుందని కొనియాడుతూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు…
ఈ కార్యక్రమంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యులు కే.ఎస్. రామారావు, ప్రముఖ హీరో వడ్డే నవీన్, సంగీత దర్శకులు రఘు కుంచె, సినీ నటులు దివ్య వాణి, అనిత, రాజీవ్ కనకాల, సమీర భరద్వాజ్, ఆట సందీప్, జ్యోతి,బింబిసార మూవీ ఫేమ్ బేబీ శ్రీదేవి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ అంబికా కృష్ణా, కార్యక్రమ నిర్వాహకులు విష్ణు బొప్పన, రవికుమార్, అనిత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News