-బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం
-గ్రామీణ స్థానిక సంస్థల్లో 34, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లు
-నిబంధనలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం
-బీసీ రిజర్వేషన్ల కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం
-28 జిల్లాలకూ జెడ్పీలు ఏర్పాటు-మేయర్, ఛైర్మన్లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు
-పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా బీసీలకు వెన్నుదన్నుగా..
-బీసీల్లో లెజండరీ నాయకత్వాన్ని అందించింది టీడీపీనే
-స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు ఘనత మాదే
-గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీ నాయకత్వానికి తీరని ద్రోహం చేసింది
-బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయాన్ని హర్షాతిరేకాల మధ్య సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జయహో బీసీ… అంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. సభ్యుల హర్షాతిరేకాల మధ్య స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ నిర్ణయాన్ని మంగళవారం జరిగిన రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి…బీసీ సాధికారతకు కట్టుబడి ఉందని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా సామాజిక న్యాయమే అజెండా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారిగా రిజర్వేషన్‌లను వర్తింప చేస్తూ ఎన్టీఆర్ నాడు తీసుకున్న నిర్ణయం మొదలుకుని ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను సీఎం చంద్రబాబు సభలో వివరించారు. నిబంధనలకు అనుగుణంగా.. అన్ని పరిమితులకు లోబడి స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక ప్రాంత సంస్థల్లో 33.33 శాతం మేర రిజర్వేషన్‌లను బీసీ వర్గాలకు వర్తింప చేయనున్నట్టు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన పంచాయతీరాజ్ చట్ట ప్రకారం రిజర్వేషన్ల పెంపును అమలు చేస్తున్నట్టు తెలిపారు. 1995, 2001, 2006, 2013 సంవత్సరాల్లో 34 శాతం రిజర్వేషన్‌లతోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించినట్టు ముఖ్యమంత్రి సభకు గుర్తు చేశారు. సామాజిక న్యాయం అజెండాతో పని చేయడం వల్లే ఎర్రన్నాయుడు, కేఈ కృష్ణమూర్తి, యనమల, దేవేందర్ గౌడ్, అయ్యన్న పాత్రుడు వంటి లెజండరీ నాయకత్వం బీసీ వర్గాల నుంచి వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్‌లను 24 శాతానికి కుదించడం ద్వారా 16800 మంది స్థానిక బీసీ నేతలకు రాజకీయాల్లో అవకాశాలు దక్కలేదని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల సామాజిక, రాజకీయ, ఆర్థిక అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌లను వర్తింప చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ, ప్రత్యేక కేబినెట్ సమావేశం నిర్వహించి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల పెంపుపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఈ 34 శాతం రిజర్వేషన్ ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని ముఖ్యమంత్రి కోరారు.
స్థిరమైన పాలన కోసమే పట్టణ స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలు..
ఆయారాం.. గయారాం అనే విధానం కాకుండా సుస్థిరమైన పాలన అందించడం కోసమే పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలను ప్రత్యక్ష ఎన్నికల ద్వారా చేపడతామని సీఎం వెల్లడించారు. ఈ మేరకు కెబినెట్లో నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దీంతో పాటు జిల్లాల విభజన జరిగినా ప్రస్తుతం 13 జిల్లా ప్రజా పరిషత్‌లే ఉండటంతో, పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లా ప్రజా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 16వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన రూ.2,300 కోట్ల గ్రామీణ గ్రాంట్లు, రూ.1,562 కోట్ల పట్టణ గ్రాంట్లు రావాలంటే స్థానిక ఎన్నికలు నిర్వహించడం అత్యంత ఆవశ్యకమని, సరైన అభ్యర్థుల ఎంపిక ద్వారా భావి నాయకత్వాన్ని అందించాలని కూటమి నేతలను కోరారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలను గాంధీజీ స్ఫూర్తితో అభివృద్ధి చేయడానికి కూటమి అంతా కలిసి కట్టుగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు బీసీలే వెన్నెముక…
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను, గ్రామీణ వ్యవస్థను, వ్యవసాయాన్ని, చేతివృత్తులను నిలబెట్టింది బీసీ సమాజమేనని సీఎం కొనియాడారు. రాష్ట్రంలో 50.42 శాతం ఉన్న బీసీల శ్రమకు, చీరను నేసి అగ్గిపెట్టెలో పెట్టే అద్భుత నైపుణ్యానికి సాంకేతికతను జోడించి వారి శక్తిని ప్రపంచానికి అందిస్తామన్నారు. బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లను అత్యుత్తమంగా మార్చి విద్యకు మెరుగైన బాటలు వేస్తామన్నారు. విద్య, నైపుణ్యం, ఉపాధి, ఎంటర్‌ప్రెన్యూర్లు, రాజకీయ ప్రాతినిధ్యం ద్వారా వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేవలం రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు మాత్రమే అభివృద్ధి కాదని, ఆర్థిక అసమానతలు లేకుండా జీవన ప్రమాణాలు పెంచుతూ చివరి వ్యక్తిని ముందుకు తేవడమే అసలైన అభివృద్ధి అని చెప్పారు. బీసీ రిజర్వేషన్లు ఎవరికీ వ్యతిరేకం కాదని, రాజ్యాంగ పరిధిలో చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా సామాజిక న్యాయం సాధించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు. బీసీ అంటే వెనుకబడిన వారు కాదు, అవకాశం రాక వెనుకబడిన వారు మాత్రమే అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఎంపీటీసీ నుంచి ఎంపీగా అవకాశం…
1984లో ఎన్టీఆర్ స్థానిక సంస్థలు, మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించగా, 73, 74వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తితో తన హయాంలో ‘యాక్ట్ ఆఫ్ 5’ కింద బీసీలకు 34 శాతం మేర రిజర్వేషన్లు పెంచామన్నారు అదే కోటా ప్రకారం 1995, 2001, 2006, 2013 స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్లు అమలు చేశారన్నారు. పార్టీ ప్రోత్సహించి స్థానిక సంస్థల్లో భాగస్వామ్యం కల్పిస్తే క్షేత్రస్థాయి నుంచి నేతలుగా ఎదుగుతారని, కర్నూలు జిల్లాకు చెందిన ఎంపీటీసీ బస్తిపాటి నాగరాజును ఎంపీగా చేసి సముచిత న్యాయం చేశామని ఉదహరించారు. పంచాయతీల నుంచి కేంద్ర మంత్రివర్గం వరకు బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు చేపడతామన్నారు.
కోర్టుల్లో కేసులు వేస్తే చరిత్ర హీనులే…
శాసనసభలో ఈ ప్రకటన చేయగానే వైసీపీ కోర్టుల్లో కేసులు వేసేందుకు సిద్ధంగా ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. మెగా డీఎస్సీ విషయంలోనూ ఇదే తరహాలో వందలాది కేసులు వేశారని తెలిపారు. ఈ రిజర్వేషన్ల విషయంలో కోర్టులకు వెళ్లి కేసులు వేస్తే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. ఇంతటి చారిత్రక సమావేశానికైనా వైసీపీ నేతలు హాజరవుతారని భావించానని, కానీ రాకపోవడం దారుణమని సీఎం అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా జాతీయ జెండా ఎగురవేయకుండా నిర్లక్ష్యం చేస్తూ అవమానించిన వ్యక్తులను ఏమనాలని ప్రశ్నించారు. గత పాలకుల పై కేసులు 20 ఏళ్లుగా కింది కోర్టుకు, పైకోర్టుకూ ఊగిసలాడుతూనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. 2019లో గత పాలకులు బీసీ రిజర్వేషన్ల విషయంలో 176 జీవో తెచ్చి నాటకాలు ఆడారని, సుప్రీం కోర్టుకు కూడా అప్పీలు చేయకుండా వదిలేశారని సీఎం విమర్శించారు. 559, 560 జీవోల ద్వారా రిజర్వేషన్‌లను 34 శాతం నుంచి 24.15 శాతానికి తగ్గించి, 16,800 మంది బీసీ నాయకత్వానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలకు ద్రోహం చేయడంలో వైసీపీ నెంబర్ వన్ అని ధ్వజమెత్తారు. గత పాలకులు బీసీలపై కక్షగట్టి, తమ వెనుక లేరన్న భావనతో ఇబ్బందులు పెట్టారని సీఎం తెలిపారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అయ్యన్నపాత్రుడు, పల్లా శ్రీనివాస్, కూన రవికుమార్ వంటి బీసీ నేతలపై కేసులు పెట్టి వేధించారని ఆరోపించారు. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే కుర్రాడిని పెట్రోలు పోసి తగులబెట్టారని, టీడీపీకి మద్దతిస్తున్నారన్న కారణంతో తోట చంద్రయ్య గొంతుపై కత్తిపెట్టారని, కంచర్ల జాలయ్య, నందం సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయినా సిద్ధాంతాలను వదులుకోలేదని గుర్తుచేశారు. చివరికి బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా కనీసం కుర్చీలు కూడా వేయకుండా అవమానించారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రసంగం ముగించగానే ముఖ్యమంత్రి వద్దకు బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు వెళ్లి అసెంబ్లీ సమావేశ మందిరంలో కృతజ్ఞతలు తెలిపారు.
Prajavartha Online Telugu News