-శిక్షణలో పొందిన నైపుణ్యాలను ఉపాధి, స్వయం ఉపాధిగా మలుచుకోవాలి
-మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తారు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలు, అనుభవాన్ని వినూత్న ఆలోచనలతో మేళవించి వివిధ ఉత్పత్తులను తయారు చేసి, వాటిని మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు ‘రైజ్’ కార్యక్రమం చుక్కానిలా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు
.
ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి రైజ్ కేంద్రంలో నిర్వహించిన క్రాఫ్ట్ అండ్ ఆర్ట్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మినీ ఎక్స్పోను శనివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఢిల్లీ నుండి వచ్చిన ఓడిఓపి అధికారి ఇషాదీప్ సింగ్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ, ప్రస్తుత సమాజంలో ప్రతి మహిళ తనకంటూ ఒక నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకుని స్వసక్తితో ఎదగాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. మహిళ ఆర్థికంగా బలపడినప్పుడు కుటుంబానికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంతో పాటు, కుటుంబ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత జీవనశైలి అధిక ఖర్చులతో ముడిపడి ఉందని, కుటుంబ అవసరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మహిళలు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ఏదో ఒక పనిని ఉపాధిగా లేదా వ్యాపకంగా చేపట్టి ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సూచించారు. మహిళల కలలను కార్యరూపంలోకి తీసుకురావడానికి ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా కోట్లాది రూపాయల రుణాలను అందిస్తోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని మహిళలు చిన్నతరహా వ్యాపారాలను ప్రారంభించడంతో పాటు, తాము నేర్చుకున్న నైపుణ్యాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చన్నారు. ప్రతి మహిళ ఏదో ఒక నైపుణ్యాన్ని కలిగి ఉండేలా రైజ్ కేంద్రంలో వివిధ రకాల శిక్షణా కోర్సులను నిర్వహిస్తున్నామని తెలిపారు. శిక్షణ పొందిన మహిళలు కేవలం శిక్షణతో ఆగిపోకుండా, తమ నైపుణ్యాలను ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్, బ్రాండింగ్ తదితర అంశాలతో అనుసంధానం చేసుకుని స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి ఉత్పత్తి వ్యయం, విక్రయ ధర, మార్కెటింగ్ విధానం, బ్రాండింగ్, ఉత్పత్తులకు లభిస్తున్న ఆదరణ తదితర అంశాలపై మహిళలతో చర్చించారు. ఉత్పత్తుల నాణ్యతను మరింత మెరుగుపరచడంతో పాటు, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులను రూపొందించాలని సూచించారు. మంచి ఉత్పత్తి తయారీతో పాటు దానికి సరైన మార్కెటింగ్, ఆకర్షణీయమైన ప్యాకేజింగ్, బ్రాండింగ్ ఎంతో ముఖ్యమని కలెక్టర్ పేర్కొన్నారు. రైజ్ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణా కార్యక్రమాలను మహిళలు సద్వినియోగం చేసుకుని తమలోని ప్రతిభను వెలికితీసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. శిక్షణ ద్వారా పొందిన నైపుణ్యాలను ఆదాయ వనరులుగా మార్చుకుని, కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి మహిళలు ఎదగాలని ఆకాంక్షించారు. మహిళలకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత్వం, ఆర్థిక సహకారం అందించడం ద్వారా వారిని స్వయం ఉపాధి దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఏఎన్వీ నాంచారరావు, రైజ్ మేనేజర్ బి. తేజస్విని, డీఆర్డీఏ సిబ్బంది, రైజ్ కేంద్రం సిబ్బంది, శిక్షణ పొందిన మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News