విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పి.బి. సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎలక్ట్రానిక్స్, ఆర్టిఫిషల్ ఇంటెలిజన్స్ విభాగాలు కృత్రిమ మేధతో పనిచేసే హ్యూమనాయిడ్ రోబోటిక్స్ పై నిర్వహించిన రెండు రోజుల వర్క్ షాపు మంగళవారం ముగిసింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎడ్యుబాటిక్స్ బిజినెస్ మేనేజర్ కె. సందీప్ విద్యార్థులకు మానవ రూప రోబో పనితీరును వివరించారు. పైథాన్ లాంగ్వేజ్ వినియోగించడం ద్వారా రోబోతో నిర్దేశిత కృత్యాలు చేయించారు. ఎల్. పి. అడ్రస్ ద్వారా రోబోను విద్యార్థులు ముందుకు, వెనకకు కదిలించారు. ఎంపిక చేసిన విద్యార్థుల దగ్గర ఉన్న కళాశాల ఐడీ కార్డు, స్మార్ట్ వాచీ, మొబైల్ ఫోన్లను రోబో గుర్తించడంతో విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుత రోబో తయారీకి రెండున్నర లక్షల రూపాయల మేర ఖర్చు చేసినట్లు డైరెక్టర్ వేమూరి బాబూరావు తెలిపారు. ఈ సందర్భంగా ఏఐ విభాగాధిపతి డా. కె. ఉదయశ్రీ మాట్లాడుతూ సమీప భవిష్యత్ లో మానవులు చేసే సాధారణ పనులు, దైనందిన కృత్యాలు రోబోలు క్షణాల్లో చేసేస్తాయన్నారు. ఎలక్ట్రానిక్స్ విభాగాధిపతి కె.సాంబశివరావు మాట్లాడుతూ కొరియా, జపాన్, చైనాల్లో ఇప్పటికే కార్మికులకు ప్రత్యామ్నాయంగా రోబోలు పెద్ద ఎత్తున వినియోగంలోకి వచ్చేశాయన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సందీప్ ను డైరెక్టర్ వేమూరి బాబూరావు, డీన్ ప్రొఫెసర్ రాజేశ్ సి.జంపాల, వైస్ ప్రిన్సిపాల్ డా. మనోరంజని సత్కరించారు.
Prajavartha Online Telugu News