అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ మెడికల్, పారా మెడికల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ అలైడ్ మెడికల్ హెల్త్ సైన్సెస్ & పారా మెడికల్ జేఏసీ ముఖ్య ప్రతినిధులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర సచివాలయంలోని మంత్రిని తన చాంబర్లో మంగళవారం సాయంత్రం వీరు కలుసుకుని సర్వీస్ విషయాల్లో సానుకూల నిర్ణయం తీసుకో నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో క్రమబద్ధీకరించే వరకు 100 శాతం గ్రాస్ జీతం చెల్లించాలని, ఉద్యోగులకు రూ.50 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రతినిధులు కోరారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు EPF పూర్తి ప్రయోజనాలు కల్పించాలని, సీనియారిటీ, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లు, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులతో త్వరలో సమావేశాన్ని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News