జూనియర్ డాక్టర్ల డిమాండ్లపై సానుకూలంగా..సానుభూతితో పరిశీలిస్తాం

-స్టైపెండ్‌ పెంపుపై ఉన్నత స్థాయి అధికారుల కమిటీ త్వరలోనే జూడా ప్రతినిధులతో భేటీ
-రిటైర్మెంట్‌ వయసు పెంపుపైనా పునఃపరిశీలన
-నాన్‌ క్లినికల్‌ పోస్టుల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ అభ్యర్థుల అంశాన్నీ పరిశీలిస్తాం
-సమ్మె విరమించిన జూడాలకు వైద్య‌, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాద‌వ్‌ కృతజ్ఞతలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జూనియర్‌ డాక్టర్ల (జూడా) డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర‌ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాద‌వ్‌ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిమితులను దృష్టిలో ఉంచుకుని.. ఇతర రాష్ట్రాల్లో జూనియ‌ర్ డాక్ట‌ర్ల‌కు అందుతున్న స్టైపెండ్‌, ఇతర ప్రయోజనాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణల్లో వీరికి అందుతున్న స్టైపెండ్ తదితర అంశాలను రాష్ట్రంలో అమలవుతున్న విధానంతో పోల్చి ఇప్పటికే కూలంకషంగా చర్చించామన్నారు. రాష్ట్ర స‌చివాల‌యంలోని త‌న ఛాంబ‌ర్‌లో మంగ‌ళ‌వారంనాడు జూడా ముఖ్య ప్ర‌తినిధులు మంత్రి సత్య కుమార్, కార్యదర్శి జి వీర పాండియన్ ను క‌లిశారు. సమ్మెను విరమించి విధుల్లోనికి
వెళ్లడం ప్రారంభించినట్లు ప్రతినిధులు మంత్రికి తెలియజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సత్య కుమార్ మాట్లాడారు.
జూనియ‌ర్ డాక్ట‌ర్లు ప్రధానంగా స్టైపెండ్ పెంపుతో పాటు రిటైర్మైంట్‌ వయసు పెంచకూడదని జూడా ప్రతినిధులు ఇంతకుముందు డిమాండ్‌ చేశారని మంత్రి తెలిపారు. రిటైర్మైంట్ వయసు పెంపు అంశంపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యుల లభ్యత తగ్గుతున్న నేపథ్యంలో ఆ అంశాన్ని కేవలం పరిశీలన మాత్రమే చేశామని చెప్పారు. జూడాల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దీనిపై మరోసారి పునఃపరిశీలన చేస్తామని వెల్లడించారు.

స్టైఫండ్‌ పెంపు అంశం పై కమిటీ పరిశీలన

స్టైఫండ్‌ పెంపు అంశంపై ప్రత్యేకంగా కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఆరోగ్యశాఖ కార్యదర్శి వీరపాండియన్‌ ఆధ్వర్యంలో కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో జూడా సంఘాల నాయకులతో కమిటీ సమావేశమై వారి డిమాండ్లపై చర్చిస్తుందని తెలిపారు. ప్రభుత్వం ఆర్థిక పరిమితులు, అందుబాటులో ఉన్న వనరులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు.

నాన్‌ క్లినికల్‌ పోస్టులపైనా పునఃపరిశీలన

నాన్‌ క్లినికల్‌ విభాగాల్లో ఎంఎస్సీ, పీహెచ్‌డీ అర్హత కలిగిన వారిని నియమించే అంశంపైనా మరోసారి పునఃపరిశీలన చేస్తామని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. జాతీయ వైద్య కమిషన్‌ (NMC) మార్గదర్శకాలకు అనుగుణంగా కొత్త వైద్య కళాశాలలను త్వరగా ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడిందని, అందులో భాగంగానే నోటిఫికేషన్లు జారీ చేసినట్లు తెలిపారు. వాటికి తగిన స్పందన రాని పరిస్థితుల్లో కొన్ని చర్యలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఈ అంశంపైనా జూడాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని పునఃపరిశీలిస్తామని స్పష్టం చేశారు.

సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం

జూడాల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సత్యకుమార్‌ తెలిపారు. ప్రభుత్వం వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ పరిమితులపై జూడా నాయకులకు కూడా అవగాహన ఉందన్నారు. అందువల్ల ఇరువర్గాల మధ్య చర్చల ద్వారా సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరుగుతుందని పేర్కొన్నారు.

9,500 మంది వైద్యుల సేవలు కీలకం

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో దాదాపు 9,500 మంది జూడాలు సేవలు అందిస్తున్నారని మంత్రి తెలిపారు. పేద, సామాన్య ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై ఆధారపడుతున్నారని, ముఖ్యంగా అత్యవసర వైద్య సేవల్లో జూడాల పాత్ర కీలకమని చెప్పారు. సమ్మె కారణంగా అత్యవసర వైద్య సేవలకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూడాలు మానవతా దృక్పథంతో సమ్మె విరమించడం అభినందనీయమన్నారు.
ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించిన జూడా నాయకులకు, డాక్టర్లందరికీ మంత్రి సత్యకుమార్‌ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *