విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఫోటో జర్నలిస్టు నైపుణ్యం,శ్రమ కలగలిసిన కళాకారుడని సి.ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఫోటో జర్మలిస్టుల అసోసియేషన్ (ఏపీపీజేఏ) ఆధ్వర్యంలో నేషనల్ ఫోటో కాంటెస్ట్-2026 అవార్డుల ప్రధానోత్సవం మంగళవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. సి.ఆర్.మీడియా అకాడమీ, ఏపి స్టేట్ క్రియేటివ్ అండ్ కల్చరర్ కమీషన్ లు ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పాటునందించాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఒక ఫోటో ‘వార్తకు’ ప్రాణం పోస్తుందనడం అతిశయోక్తి కాదన్నారు. ఒకఅంశాన్ని చిత్రం(ఫోటో) తో పాటు వివరించడం సంఘటనను పాఠకులకు మరింత చేరువ చేస్తుందన్నారు.
తమ నలభై యేళ్ళ జర్నలిస్టు అనుభవంలో ఫిల్మ్ కెమెరాలు, డిజిటల్ కెమెరాలు, చివరికి స్మార్ట్ ఫోన్ కెమెరాలు వాడకం చూశామని, అన్ని దశల్లోనూ ఫోటోల నాణ్యత ఒకేలా ఉందని చెప్పలేమన్నారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన నేపధ్యంలో ఫోటోగ్రఫీ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని, దానిపై ఫోటో జర్నలిస్టులు నూతన, సాంకేతిక తను అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ 530 కోట్ల ఫోటోలు తీస్తున్నట్లు ఒక సర్వే లో వెల్లడైందన్నారు. ఇదంతా స్మార్ట్ ఫోన్ల వల్లనే సాధ్యం అవుతోందన్నారు. అయితే, సాధారణ ఫోటోలు, వార్తల కోసం తీసే ఫొటో లతోపాటు కళాత్మక ఫోటోగ్రఫీ ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. గతంలో “ఇలస్ట్రేటెడ్ వీక్లీ”వంటి పత్రికలు కళాత్మక ఫోటోగ్రఫిని, ఫోటో జర్నలిస్టులను ప్రోత్సహించేవన్నారు.
తాను క్లిక్ మనిపించిన ఫోటో ను మనస్సు తో అనుభూతి చెంది, ఆనందించడం ఫోటో జర్నలిస్టులందరికీ అనుభవంలో ఉంటుందన్నారు. సంఘటన కు అతి చేరువలో వుండి, ఓపిగ్గా నిరీక్షించడం ద్వారా ఫోటో జర్నలిస్టులు ఎన్నో చారిత్రాత్మక ఫోటోలు తీయగలిగారన్నారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు ను సూచించే ప్రసిద్ధ ఫోటో అలాంటి వాటిలో ఒకటని ఆయన గుర్తు చేశారు. సమాజంలోని మార్పులను ప్రజల జీవన విధానాన్ని, ప్రకృతి అందాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఫోటోగ్రఫీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. సమాజంలో జరిగే సంఘటనలను భవిష్యత్తు తరాలకు భద్రపరచడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు
గౌరవ అతిధిగా విచ్చేసిన ఐజేయూ సెక్రటరీ జనరల్ డి. సోమ సుందర్ మాట్లాడుతూ ఫోటోగ్రఫీ అనేది కేవలం కళ మాత్రమే కాదని సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజల ముందుకు తీసుకువచ్చే శక్తివంతమైన మాధ్యమ అని అన్నారు. ఒక్క ఫోటో 1000 మాటలను చెప్పగలదని, ప్రజా సమస్యలు, సామాజిక మార్పులు, ప్రకృతి వైభవం వంటి అంశాలను ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాల ద్వారా చక్కగా ఆవిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఫోటో జర్నలిస్టులు వృత్తిపరమైన నిబద్ధతతో పని చేస్తూ సమాజానికి మరింత సేవ చేయాలని సూచించారు.
ఏపిపిజేఏ అధ్యక్షులు సిహెచ్.వి.ఎస్. విజయ భాస్కరరావు, జనరల్ సెక్రటరీ జి.మహేష్ మాట్లాడుతూ ఈ ఫోటో కాంటెస్ట్కు 15 రాష్ట్రాల నుండి 110 మంది పాల్గొన్నారని అందులో 440 ఫోటోలు వచ్చాయన్నారు. ఈ పోటీల్లో జాతీయ స్థాయి ఇంగ్లీష్ పత్రికలు, నేషనల్ రీజనల్ న్యూస్ పేపర్లు, న్యూస్ ఏజెన్సీల ఫోటో జర్నలిస్టుల నుండి ఎంట్రీలు వచ్చాయన్నారు. అంతకు ముందు అవార్డులకు ఎంపికైన ఫోటో లతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్య అతిధులు తిలకించి ఫోటోజర్నలిస్టులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏపిపిజేఏ గౌరవ అధ్యక్షులు జి.వి.నారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.రూబిన్, కోశాధికారి సిహెచ్. నారాయణరావు, ఏపియూడబ్ల్యూజే జనరల్ సెక్రటరీ కె.జయరాజు, సిహెచ్. వి.మస్తాన్, ఏపియూడబ్ల్యూజే నాయకులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ఎస్ కే బాబు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News