-2026-27 రాష్ట్ర వార్షిక ప్రణాళిక కు కేంద్రం ఆమోదం
-మానవ వనరులు, క్షయ నిర్మూలన, ఉచిత డయాగ్నస్టిక్స్‌కు అధిక కేటాయింపులు
-అత్యవసర వైద్యం, టెలీ కన్సల్టేషన్‌కు కొత్తగా రూ.75.50 కోట్లు
-రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కార్యక్రమాల అమలుకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,447.98 కోట్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో కేంద్రం వాటా రూ.1,468.79 కోట్లు కాగా.. రాష్ట్ర వాటా రూ.979.19 కోట్లు. అందుబాటులో ఉన్న నిధులతో రాష్ట్రం ప్రాధాన్యతా క్రమంలో కార్యక్రమాలను అమలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ నేడొక ప్రకటన జారీ చేశారు
సిబ్బంది జీతాలకు రూ.1,008.50 కోట్లు
NHMలో మానవ వనరులు, సిబ్బంది జీతాలకు అత్యధికంగా రూ.1,008.50 కోట్లు కేటాయించారు. వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది జీతాల వ్యయంలో కొంత భాగాన్ని కేంద్రం రీయింబర్స్ చేయనుంది. మందులు, వ్యాక్సిన్లు, రియాజెంట్లకు రూ.411.12 కోట్లను వస్తు గ్రాంట్ల రూపంలో కేంద్రం సమకూర్చనుంది. రొటీన్ ఇమ్యునైజేషన్, వైరల్ హెపటైటిస్, మలేరియా, డెంగ్యూ, క్షయ నియంత్రణ కార్యక్రమాలకు అవసరమైన వ్యాక్సిన్లు, మందులు, రియాజెంట్లను వీటి ద్వారా అందించనున్నారు.
క్షయ నిర్మూలనకు రూ.116.50 కోట్లు
క్షయ వ్యాధి నియంత్రణ, వ్యాధి గుర్తింపు, చికిత్సకు రూ.116.50 కోట్లు కేటాయించారు. ప్రజలకు ఉచితంగా పరీక్షలు అందించే డయాగ్నస్టిక్స్ కార్యక్రమానికి రూ.114.55 కోట్లు మంజూరయ్యాయి. పిల్లలకు టీకాల కార్యక్రమాన్ని మరింత సమర్థంగా అమలు చేసేందుకు రొటీన్ ఇమ్యునైజేషన్‌కు రూ.97.65 కోట్లు కేటాయించారు. హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్ల నిర్వహణ, కార్యకలాపాలకు రూ.94.22 కోట్లు, అత్యవసర పరిస్థితుల్లో సత్వర రవాణా, వైద్య సేవలందించే 108 అంబులెన్స్ సేవలకు రూ.92.95 కోట్లు కేటాయించారు.
జననీ శిశు సురక్షా కార్యక్రమానికి రూ.88.66 కోట్లు, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్‌కు రూ.79.82 కోట్లు, అనీమియా ముక్త్ భారత్ కార్యక్రమానికి రూ.77.58 కోట్లు, ఉచిత మందుల కార్యక్రమానికి రూ.77.52 కోట్లు కేటాయించారు. కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌కు రూ.72.22 కోట్లు, Facility Based Newborn Careకు రూ.70.62 కోట్లు, వైద్య పరికరాల నిర్వహణకు రూ.69.93 కోట్లు మంజూరయ్యాయి.
క్యాన్సర్, మధుమేహ నియంత్రణకు రూ.68.28 కోట్లు
క్యాన్సర్, మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్ నియంత్రణ కార్యక్రమానికి రూ.68.28 కోట్లు కేటాయించారు. ఉచిత డయాలసిస్ సేవలకు రూ.67.78 కోట్లు, అంధత్వ నియంత్రణకు రూ.62.68 కోట్లు, మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా తదితర వెక్టర్ బోర్న్ వ్యాధుల నియంత్రణకు రూ.51.84 కోట్లు కేటాయించారు. క్వాలిటీ అస్యూరెన్స్ కార్యక్రమానికి రూ.39.82 కోట్లు, హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ నిధులకు రూ.35.10 కోట్లు, జన ఆరోగ్య సమితుల (JAS)కు రూ.32.97 కోట్లు, జననీ సురక్షా యోజనకు రూ.31.75 కోట్లు కేటాయించారు.
అత్యవసర వైద్యానికి ప్రాధాన్యం
2026–27లో NHM కింద కొత్తగా చేపట్టనున్న ఐదు కార్యక్రమాలకు కలిపి రూ.75.50 కోట్లు కేటాయించారు. గుండెపోటు బాధితులకు అత్యవసరంగా వినియోగించే STEMI మందుల కొనుగోలు, సరఫరాకు రూ.26.60 కోట్లు కేటాయించారు. కేర్ కోఆర్డినేషన్, టెలీ కన్సల్టేషన్ రూమ్‌ల ఏర్పాటుకు రూ.25.88 కోట్లు, టెలీ కన్సల్టేషన్ల కోసం డెస్క్‌టాప్ కంప్యూటర్లకు రూ.11.01 కోట్లు, అత్యవసర ట్రామా కేర్ పరికరాలకు రూ.7.25 కోట్లు, బర్న్ యూనిట్ల పరికరాలకు రూ.4.76 కోట్లు కేటాయించారు. దీంతో అత్యవసర వైద్య సేవలతోపాటు టెలీ కన్సల్టేషన్ వ్యవస్థను మరింత విస్తరించే అవకాశం ఏర్పడింది.
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ట్రైబల్ RCH కార్యక్రమానికి రూ.25.18 కోట్లు, బ్లడ్ సెల్‌కు రూ.26.28 కోట్లు కేటాయించారు. లెప్రసీ నిర్మూలన కార్యక్రమానికి రూ.11.47 కోట్లు, వైరల్ హెపటైటిస్ నియంత్రణకు రూ.11.77 కోట్లు, మొబైల్ మెడికల్ యూనిట్లకు రూ.12.46 కోట్లు మంజూరయ్యాయి. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో మొబైల్ మెడికల్ యూనిట్లు కీలకం కానున్నాయి.
రూ.411.12 కోట్లు వస్తు గ్రాంట్లు
మొత్తం రూ.2,447.98 కోట్ల Resource Envelopeలో రూ.411.12 కోట్లు వస్తు గ్రాంట్ల రూపంలో, రూ.120.70 కోట్లు Infrastructure Maintenance కింద కేటాయించారు. దీంతో వివిధ ఆరోగ్య కార్యక్రమాలకు వినియోగించేందుకు నికరంగా రూ.1,916.16 కోట్ల నగదు అందుబాటులో ఉంటుంది. కేంద్రం ఆమోదించిన కార్యకలాపాల విలువ Resource Envelope కంటే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అందుబాటులో ఉన్న నిధులను అత్యంత అవసరమైన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ వినియోగించాల్సి ఉంటుంది. 2026–27లో ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర వాటాలను కలిపి రూ.1,175.03 కోట్ల బడ్జెట్ విడుదలైంది.
ప్రజలకు నేరుగా ప్రయోజనం: మంత్రి
కేంద్రం ఆమోదించిన నిధులను ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరేలా వినియోగిస్తామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. అత్యవసర వైద్య సేవలను బలోపేతం చేయడంతోపాటు టెలీ కన్సల్టేషన్ వ్యవస్థను విస్తరిస్తామని చెప్పారు. ప్రజలకు అవసరమైన మందులు, వ్యాక్సిన్లు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Prajavartha Online Telugu News