రూ.140 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

-అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్‌లో భాగంగా హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా అభివృద్ధి పనులకు శ్రీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పంలో హైబ్రిడ్ ఆన్ యువర్ టీ మోడల్ ద్వారా వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం ముఖ్య అతిథులు కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విజయవాడ అభివృద్ధికి రూ.140 కోట్లతో మౌలిక వసతులు

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.5,500 కోట్ల విలువైన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయడం రాష్ట్ర అభివృద్ధిలో కీలక ముందడుగని అన్నారు.

విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో రూ.140 కోట్ల వ్యయంతో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను చేపట్టడం సంతోషకరమన్నారు. విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతాలను సమతుల్యంగా అభివృద్ధి చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని మౌలిక వసతుల ప్రాజెక్టులను చేపట్టి విజయవాడ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి నగరాలకు దీటుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి

20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. కుప్పంలో ముఖ్యమంత్రి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తున్న కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించడంతో పాటు, ఆయా నగరాల్లో స్థానిక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం ద్వారా సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని తెలిపారు.

రహదారులు, వీధి దీపాలు, పార్కుల అభివృద్ధి

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ నగర పరిధిలో రూ.140 కోట్ల వ్యయంతో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులను హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా చేపట్టడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నగరంలోని రహదారులు, వీధి దీపాలు, పార్కులు తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నగర మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి, ప్రజలకు పరిశుభ్రమైన, సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన నగర వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా పనులను చేపడుతున్నామని కమిషనర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ పి. సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) చంద్రశేఖర్, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్, కె. ప్రభుదాస్, కె. షమ్మీ, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఏ. శ్రీధర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు గోపాలకృష్ణమూర్తి, సురేఖ, అసిస్టెంట్ కమిషనర్లు ఏ.యు.బి. శర్మ, హెలెన్ ప్రభావతి తదితరులు, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *