విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త :
విజయదశమి శరన్నవరాత్రుల సందర్భంగా సీతానగరంలోని విజయకీలాద్రి దివ్యక్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మవారికి గురువారం భక్తిశ్రద్ధలతో సారె సమర్పించారు. పరమహంస పరివ్రాజకులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. విజయకీలాద్రి ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు, రఘునాథాచార్యులు, ఆలయ అర్చకులు అనంత్ స్వామి, శ్రీనివాస్ సుదర్శన స్వామి, శ్రీనివాస్ సంతోష్ స్వామి, నల్లూరి కృష్ణతో పాటు వేద విద్యార్థులు పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. ప్రతి ఏడాది శరన్నవరాత్రుల సందర్భంగా విజయకీలాద్రి నుంచి కనకదుర్గమ్మవారికి సారె సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారు కనకదుర్గమ్మను తన సోదరిగా భావిస్తారనే సంప్రదాయ విశ్వాసానికి ప్రతీకగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తి, సంప్రదాయం, ఆధ్యాత్మిక అనుబంధానికి ప్రతీకగా ఈ వేడుక నిలుస్తోంది.
Prajavartha Online Telugu News