విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనం కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తొలి దళిత ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. డా.జగ్జీవన్ రామ్‌గారి 114 వ జయంతిని పురస్కరించుకుని ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి, స్థానిక కార్పొరేటర్ ఎండి షాహినా సుల్తానా హఫిజుల్లాతో కలిసి అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ వద్దనున్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అణగారిన ప్రజల హక్కుల కోసం బాబూ జగ్జీవన్‌రామ్ చేసిన కృషి మరువలేనిదన్నారు. దేశ ఉప ప్రధానిగా, నాలుగు దశాబ్దాల పాటు కేంద్ర మంత్రిగా సేవలు అందించి, కార్మిక, వ్యవసాయ, రక్షణ, రైల్వే, కమ్యూనికేషన్స్ సహా పలు మంత్రిత్వ శాఖలలో ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. హరిత విప్లవం, బంగ్లాదేశ్ విమోచనలో తనదైన విలక్షణ పాత్ర పోషించారన్నారు. ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలకు పునరంకితం అయ్యే విధంగా 2012 లో నాటి ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతులమీదుగా జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని డివిజన్ లో ఆవిష్కరించుకోవటం జరిగిందన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, సంఘసంస్కర్తగా, ప్రజా నాయకుడిగా జగ్జీవన్ రామ్ ప్రజలకు ఎల్లకాలం గుర్తుండిపోతారని తెలిపారు. ఆ మహనీయుని ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడమే.. ఆయనకి మనమిచ్చే నిజమైన ఘన నివాళి అని పేర్కొన్నారు. జగ్జీవన్ రామ్ నడిచిన బాట, అనుసరించిన విధానాలు, చూపిన సంస్కరణ మార్గాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆ మహనీయుడు కలలుగన్న సమసమాజ నిర్మాణం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పుకొచ్చారు. ఇదే సందర్భంలో స్థానిక కమ్యూనిటీ హాల్ నందు దళిత సోదరసోదరీమణులు తక్కువ ఖర్చుతో ఘనంగా వేడుకలు నిర్వహించుకునే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు.
ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా మాట్లాడుతూ.. దేశ స్వాతంత్రం కోసం పోరాడుతూనే, సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల కోసం బాబూ జగ్జీవన్ రామ్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్ రామ్ అని.. ఆయన వేసిన బాటలు బావితరాలకు మార్గదర్శకమన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతులమీదుగా పేదలకు పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు విజయ్ కుమార్, కె. రాజు, రమేష్ రెడ్డి, గల్లెపోగు రాజు, ch. భాను, సందీప్, యేసురాజు, ఆసి, కంబగళ్ల రాజు, అమిత్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News