-25వ డివిజన్ 94 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలోనే ముందు చూపు ఉన్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 25 వ డివిజన్ – 94 వ వార్డు సచివాలయం పరిధిలో గురువారం నిర్వహించిన రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. 327 గడపలను సందర్శించి ప్రతిఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ వినతులు స్వీకరించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడి పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. పర్యటనలో భాగంగా కొల్లిపర వీధి, వీరమాచినేని రంగారావు వీధి, వారణాసి వారి వీధి, కందుకూరి వారి వీధి, చాపరాల వారి వీధి, ఐనవోలు వారి వీధులలో పారిశుధ్య నిర్వహణ తీరు మరియు డ్రెయిన్స్ నందు మురుగునీటి పారుదల విధానాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. చాపరాల వారి వీధి, ఐనవోలు వారి వీధులలో కొత్త రోడ్ల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. స్థానిక డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ను పరిశీలించిన ఆయన.. స్థానికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని రైతాంగం, యువత, మహిళలు, కార్మిక రంగం సహా వివిధ వర్గాలకు రూ.1.41 లక్షల కోట్ల సంక్షేమాన్ని డీబీటీ పద్ధతిలో అందించడం జరిగిందని మల్లాది విష్ణు అన్నారు. పేదల కోసం ఇంత మొత్తంలో ప్రత్యక్ష నగదు బదిలీ చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రమేనని కితాబిచ్చారు. చేసిన వాగ్ధానాలలో 95 శాతానికిపైగా అమలు చేశామని.. కనుకనే నిజాయితీ, నిబద్ధతతో ప్రజల ముందుకు వస్తున్నామన్నారు. అంతేగానీ గత పాలకుల మాదిరిగా మేనిఫెస్టోని కనపడకుండా చేసి ప్రజలను మోసగించడం తమకు తెలియదన్నారు. గత ఐదేళ్లు చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిందని, రామరాజ్యం కావాలని ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిగా చేశారన్నారు. కరోనా కష్టకాలంలో హైదరాబాద్ కు పారిపోయిన చంద్రబాబు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు ప్రజలకు అందించానని చెప్పే ధైర్యం 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఉందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజక పాలన చూసి ఓర్వలేక, ఉక్రోశంతో చంద్రబాబు అండ్ కో విమర్శలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారని మల్లాది విష్ణు అన్నారు. చంద్రబాబు కార్యక్రమం ఏడుపే ఏడుపుగా మారిపోయిందని విమర్శించారు.
విద్యుత్ చార్జీలపై టీడీపీ విష ప్రచారం చేస్తుందని మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ శాఖలో రూ. 22 వేల కోట్ల బకాయిలు పెట్టి వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. గత ప్రభుత్వంలో ఉన్న విద్యుత్ బకాయిలు కూడా మా ప్రభుత్వమే చెల్లించిందన్నారు. చంద్రబాబు పాలనలో మూడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారని.. కానీ ఈ ప్రభుత్వం సంక్షోభంలో ఉన్న విద్యుత్ వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఒక్క సారి అందులోనూ స్వల్పంగా పెంచడం జరిగిందన్నారు. మూడేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మార్గదర్శకంలో రాష్ట్రం ఆశించిన దానికన్నా మెరుగైన ప్రగతి సాధించిందని.. అన్ని రంగాలలోనూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పుకొచ్చారు. కాబట్టి వంద మహానాడులు నిర్వహించినా చంద్రబాబు మరలా అధికారంలోకి రాలేరని మల్లాది విష్ణు అన్నారు. మరోవైపు అజిత్ సింగ్ నగర్ డంపింగ్ యార్డులోని చెత్తను గుంటూరు డంపింగ్ యార్డుకు తరలించే ప్రక్రియ వేగవంతం చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. ప్రస్తుతం సింగ్ నగర్ లో ఉన్నది కేవలం ట్రాన్సిట్ పాయింట్ మాత్రమేనని.. ఎక్కడా కూడా చెత్తను డంప్ చేసే పరిస్థితి లేదన్నారు. కొందరు కావాలనే చెత్తకు నిప్పంటిస్తూ రాజకీయం చేస్తున్నారని.. అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, కోఆప్షన్ సభ్యులు నందెపు జగదీష్, నాయకులు బంకా భాస్కర్, గుండె సుందర్ పాల్, అబ్దుల్ నజీర్, మానం చినఅప్పయ్య, నాగేశ్వరరెడ్డి, బంకా హరికృష్ణ, ఇసరపు రాజారమేష్, కోలంటి రవి, చినబాబు, బంకా బాబి, ఆలీ, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News