విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో వివిధ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వివరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు నిర్మాణాల పనితీరు, సిమ్మెంట్ సరఫరా పై ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్‌రెడ్డి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో వివిధ స్థాయిలో జరుగుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలైన గ్రామ వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌ల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వివరించారు. జాతీయ ఉపాధిహామి పథకంలో చేపట్టిన జిల్లాకు మంజూరైన 268 గ్రామ సచివాలయ భవన నిర్మాణాలలో భాగంగా ఇప్పటికే 124 భవనాలు పూర్తి అయ్యాయని, మరో 43 భవనాలు బిలో బెస్‌మెంట్ స్థాయిలో ఉన్నాయని, వివిధ దశలో ఉన్న వాటిని వేగవంతం చేయడంతో పాటు ఇంకనూ ప్రారంభం కాని వాటి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు మంజూరైన 260 రైతు భరోసా కేంద్రాలలో 67కు పైగా భవననిర్మాణాలు పూర్తి అయ్యాయని మిగిలిన వివిధ స్థాయిలో ఉన్న వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాకు మంజూరైన 239 వైఎస్సార్ క్లినిక్‌లలో 37 పూర్తి అయ్యాయని మిగిలినవి, వివిధ స్థాయిలో ఉన్న క్లినిక్‌ల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని కలెక్టర్ డిల్లీరావు స్పెషల్ సిఎస్‌కు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అవసరమైన సిమ్మెంట్‌ను సరఫరా చేస్తున్న యాజమాన్యాలతో ఫోన్ ద్వారా మాట్లాడి సకాలంలో సిమ్మెంట్‌ను అందించి భవన నిర్మాణాలు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డిల్లీరావు సిమ్మెంట్ సరఫరా చేస్తున్న యాజమాన్యాలను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పంచాయతీ రాజ్ శాఖ ఇఇ ఎ. వెంకటేశ్వరరావు ఉన్నారు.
Prajavartha Online Telugu News