-27వ డివిజన్ 197 వ వార్డు సచివాలయం పరిధిలో మూడో రోజు గడప గడపకు మన ప్రభుత్వం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్షేమాభివృద్ధిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బుధవారం 27 వ డివిజన్ 197 వ వార్డు సచివాలయం పరిధి బావాజీపేటలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీ శైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్ కొండాయిగుంట మల్లీశ్వరి బలరాం, పార్టీ శ్రేణులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. వార్డు సచివాలయ పరిధిలోని 939 గృహాలలో, 308 గడపలను సందర్శించారు. ప్రజా సమస్యలతో పాటు వ్యాక్సినేషన్ పై ఆరా తీశారు. తొలి రెండు డోసులను పూర్తిచేసుకున్న ప్రతిఒక్కరూ బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. హెల్త్ సెంటర్లకు రాలేని పరిస్థితిలో ఇంటి వద్దనే వారికి వ్యాక్సిన్ అందించేలా ఆరోగ్య మిత్రలు, హెల్త్ సెక్రటరీలు చొరవ చూపాలన్నారు. పలు వీధులలో క్రిందికి వ్రేలాడుతున్న విద్యుత్ తీగలను గమనించిన ఆయన వెంటనే వాటన్నింటినీ పైకి మార్చాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం వీధులలో పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు. గృహ యజమానుల నుంచి తడిచెత్త, పొడిచెత్త, ప్రమాదకర చెత్తలను వేర్వేరుగా సేకరించాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. బావాజీపేటలో యూజీడీ, నూతన రోడ్ల నిర్మాణానికి రూ. 45.70 లక్షల నిధులు మంజూరు అయ్యాయని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. వీటితో పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు విన్నవించిన మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో సచివాలయానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ప్రాధాన్యత క్రమంలో పనులు జరుగుతాయని తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపు రూ. 20 కోట్ల నిధులు ఇందుకోసం ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. పేదలకు పెద్దఎత్తున అందుతున్న సంక్షేమం, జరుగుతున్న అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక తెలుగుదేశం నాయకులు ఏడుపే ఏడుపు కార్యక్రమాలు మొదలు పెట్టారని మల్లాది విష్ణు విమర్శించారు.
ఎమ్మెల్యే పర్యటనతో పలు సమస్యలకు తక్షణ పరిష్కారం
గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచన చేస్తే.. జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందని మల్లాది విష్ణు తెలిపారు. జూలై మాసంలో సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా 1,865 మందికి నూతనంగా పింఛన్లు మంజూరు కాగా.. 197వ సచివాలయ పరిధిలో 13 కొత్త పింఛన్లు ఉన్నట్లు వెల్లడించారు. వారందరికీ ఎమ్మెల్యే చేతులమీదుగా పత్రాలు అందజేశారు. మరోవైపు కుల ధ్రువీకరణ, ఇన్ కం సర్టిఫికెట్లు ఇప్పించవలసినదిగా తొలిరోజు ఎమ్మెల్యేకి విన్నవించిన వడ్డి నీరజ, రాజనేడి వెంకటలక్మి అను వారికి పత్రాలు మంజూరు కావడంతో ఎమ్మెల్యే చేతులమీదుగా అందజేశారు. జగనన్న సంక్షేమ రాజ్యంలో అర్హులు ఏ ఒక్కరూ మిగిలి పోకూడదని, అందరికీ ప్రయోజనం చేకూరాలన్న తపన, తాపత్రయంతో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు మల్లాది విష్ణు స్పష్టం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
వరదలపై విపక్షాలవి బురద రాజకీయాలు
రాష్ట్రంలో వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆదుకోవాల్సిందిపోయి ప్రతిపక్షాలు బురద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం లేకుండా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస శిబిరాలకు తరలించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రనక, పగలనక సహాయక చర్యల్ని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి దగ్గరుండి సమీక్షిస్తున్నారన్నారు. ఓవైపు వరదలతో ప్రజలందరూ ఆందోళన చెందుతుంటే.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు మాత్రం రాజకీయంగా మాట్లాడేందుకు అవకాశం లభించిందని సంతోషపడుతున్నారని ఆరోపించారు. వరద బాధితులకు అందుతున్న సాయంపై రాజకీయంగా మునిగిపోయిన చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. శిబిరాలలో ప్రజలకు అందుతున్న సాయం విషయంలో ఎక్కడా అలసత్వం లేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని స్పష్టం చేశారు. కనుక ప్రతిపక్షాలు చేస్తున్న దిగజారుడు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్(ఇంఛార్జి) అంబేద్కర్, ఏఎంఓహెచ్ రామకోటేశ్వరరావు, వైసీపీ కార్పొరేటర్ బాలిగోవింద్, నాయకులు భోగాది మురళి, బొప్పన గాంధీ, వి.బి.ఆచారి, కొరిటి శివ, కనుగుల బాల, కనపర్తి కొండా, లంకా కుమార్, సచివాలయ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News