-తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రదంగా కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్..
-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి శ్రీనివాస్ నగర్‌లో 33/11కె వి సామర్థ్యంతో రూ. 7.4 కోట్లతో నిర్మించిన కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్‌ను సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ, సైన్స్ టెక్నాలజీ, అటవీ శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ అంతరాయము లేని విద్యుత్ సరఫరాను నిరంతరం ప్రజలకు అందించడం ప్రభుత్వం లక్ష్యమన్నారు. తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఇటువంటి కంటైనర్ విద్యుత్తు సబ్ స్టేషన్‌ను మన రాష్ట్రంలో మన జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. 4 కోట్ల 30 లక్షల రూపాయలతో కంటైనర్, ఇతర సబ్ స్టేషన్ పనులు తో కలిపి రూ. 7 కోట్ల 40 లక్షలతో ఈ కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్మించుకోవడం జరిగిందన్నారు. స్థలాభావం ఉన్నచోట్ల ఇటువంటి కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మించుకోవడం, తక్కువ స్థలం తక్కువ ఖర్చులో సులభతరం అవుతుందన్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సిబ్బంది లేకుండా రిమోట్ లొకేషన్ నుండి పర్యవేక్షించవచ్చునన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని చోట కూడా ఈ తరహా సబ్ స్టేషన్‌్ నిర్మించవచ్చునన్నారు.
శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్ మాట్లాడుతూ ఈ సబ్‌స్టేషన్ నిర్మాణం వలన గొల్లపూడి ప్రాంతంలోని పంట కాలవ రోడ్డు, వెంకట స్వామి టెంపుల్ రోడ్డు, శ్రీనివాస్ నగర్, ఎట్ కిన్స్‌న్ స్కూల్ రోడ్డు, సాయి పురం కాలనీలలో ఇల్లు మరియు వాణిజ్య సర్వీసులు కలిపి 7,745 విద్యుత్ సర్వీసులు అందుబాటులో ఉంటాయాన్నారు.
మైలవరం శాసనసభ్యలు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇటువంటి సబ్ స్టేషన్ ప్రారంభించుకోవడం సంతోషకరమని ప్రస్తుతం పరిస్థితుల్లో సబ్ స్టేషన్ నిర్మించాలంటే 30 నుండి 40 సెంట్లు స్థలం కావాలని కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మించాలంటే కేవలం ఐదు సెంట్ల స్థలం సరిపోతుందన్నారు. సాదరణ సబ్ స్టేషన్ నిర్మాణానికి 8 నెలల సమయం పడుతుందని, కంటైనర్ సబ్ స్టేషన్ నిర్మాణానికి నెల రోజులు సమయం సరిపోతుందని తెలిపారు.
ఈ కంటైనర్ విద్యుత్ సబ్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపి సిపిడిసిఎల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ జె. పద్మ జనార్థన రెడ్డి, విజయవాడ టౌన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుధాకర్ పలువురు ప్రజాప్రతినిధులు విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News