రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2022-23 రబీ సీజన్ లో జిల్లాకు నిర్దేశించిన 2.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాలను అత్యంత ప్రదర్శకంగా, జవాబుదారీతనం తో కూడి చెప్పట్టాలని ఇంఛార్జి కలెక్టర్ & జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ స్పష్టం చేశారు. శనివారం మండల స్థాయి, గ్రామ స్థాయి క్షేత్ర అధికారుల, సిబ్బంది కి రబీ ధాన్యం సేకరణపై , రీ సర్వే, రెవెన్యూ అంశాలపై జిల్లా కలెక్టరేట్ నుంచి జేసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జీ కలెక్టర్ ఎన్ . తేజ్ భరత్ మాట్లాడుతూ, ప్రస్తుత రబీ సీజన్లో ధాన్యం సేకరణ కోసం షెడ్యూల్ ప్రకారం చేపట్టవలసి ఉన్న దృష్ట్యా ఆమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రస్తుత సీజన్లో 2.50 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యం ఇవ్వడం జరిగిందని, ఏప్రిల్ 16 నుంచి ధాన్యం కొనుగోలు చేయవలసి ఉందన్నారు. ఇప్పటి వరకు 10 మండలాల్లో 73 కూపెన్స్ ద్వారా 527 మెట్రిక్ టన్నుల కు షెడ్యూల్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఇంకా 8 మండలాల్లో షెడ్యూల్ ఇచ్చి కూపన్లు జారీ కోసం చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 233 కొనుగోలు కేంద్రాలను 147 మిల్లులకు ట్యాగ్ చేసినట్లు, మొత్తం 62.50 లక్షల గన్ని బ్యాగులు ప్రస్తుత సీజన్లో రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గన్ని బ్యాగులను షెడ్యూల్ ప్రకారం రొటేషన్ పద్దతిలో వినియోగించు కోవాలని అన్నారు. ప్రతి మండలంలో కంట్రోల్ రూం ఏర్పాటు చెయ్యాలని, ఇంకా బిక్కవోలు, రంగంపేట, గోపాలపురం, తాళ్లపూడి, నిడదవోలు ఎంపీడీఓ లు తక్షణం ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల్ని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా మండల స్థాయి అధికారులు పనితీరు చూపాలని తేజ్ భరత్ పేర్కొన్నారు. జిల్లాలో 55,085 హెక్టార్ల లో పంట వెయ్యగా, ఇప్పటి వరకూ 5,473 హెక్టర్ల లో కోతలు ప్రారంభం అయ్యాయని పేర్కొన్నారు.
జిల్లాలో 173 సి.హెచ్.సి లకు గాను 165 దరఖాస్తులు రావడం జరిగిందని, ఇప్పటి వరకూ 79 గ్రూప్స్ కి యంత్ర పరికరాలు పంపిణీ చేయడం జరిగిందని అధికారులు వివరించారు.. మిగిలిన యూనిట్స్ ఏర్పాటు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పేర్కొన్నారు.
జగనన్న భూ హక్కు భూ రక్ష పథకం అమలు ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మ కంగా తీసుకుందని, ఈరోజు 12 గ్రామాల పరిధిలో 4246 రాళ్ళు పాతడం లక్ష్యం కాగా కేవలం 1197 మాత్రమే చెయ్యడం పై జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 44 గ్రామాల్లో పెగ్ మార్కింగ్ లో 3669 కి గాను 3115 సాధించారని, మిగిలిన వాటిని కూడా అదే స్థాయిలో పూర్తి చెయ్యలన్నారు. 44 గ్రామాలకు చెందిన 32,815 పట్టాదర్ పాసు పుస్తకాలు ఫోటో అప్లోడ్ కుగాను 31,635 మందికి చెందిన డేటా అప్లోడ్ చేసినట్లు అధికారులు తెలియచేశారు.. మ్యుటేషన్ కి సంబందించి 22964 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకు 23,354 దరఖాస్తులు సకాలంలో ఆమోదించడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, డి ఎం (సి ఎస్) ఏ. కుమార్, డి ఆర్వో జీ. నరసింహులు, ఆర్డీవో లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, ఏ డీ సర్వే లక్ష్మణ రావు, డి ఎల్ డివో పి. వీణా దేవి, ఇంఛార్జి డి ఎస్ వో విజయ భాస్కర్, సహాయ మేనేజర్ వి. త్రినాధ్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News