-గోవధ నిషేధ పశు సంరక్షణ చట్టాన్ని -1977 ప్రతీ ఒక్కరూ పాటించాలి…
-గోవధ నిషేధ చట్టాన్ని ప్రటిష్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నరంలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా జంతు సంక్షేమ సంఘం చైర్మన్, జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధ్యక్షతన రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ, హిందు, ముస్లీమ్ సంక్షేమ సంఘం, పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో గోవధ నిషేద చట్టం అమలుపై సొసైటీ ఫర్ ప్రివేన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ ( ఎస్‌పిసిఏ) సమావేశాన్ని నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టం – 1977 ప్రకారం గోవధ నిషేధించడమైనదన్నారు. ప్రాధమికంగా మన దేశంలో అన్ని మతాలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఉంటాయని అదే సమయంలో ఇతర మతాల మనోభావాలను ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టం – 1977 ప్రకారం పశువులను వధించేందుకు ఈ చట్టం పరిమితంగానే అనుమతిస్తుందన్నారు. గర్భందాల్చిన పశువులను, పాలు తాగే లేగదూడలను వధించరాదన్నారు. ఏదైన ఒక పశువును వధించాలంటే ఆ పశువు వయస్సు 14 సంవత్సరాలు నిండి ఉండాలని, వ్యవసాయ పనులకు, పునరుత్పత్తికి పనికిరాని గిత్తలకు పశువైద్యులు నిర్థారించిన వైద్య నివేదిక తప్పనిసరిగా ఉండాలన్నారు. ఏ ప్రాంతంలోనైనా చట్ట విరుద్దంగా పశువులను వధించడం, అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు సాధారణ పౌరులు ఇచ్చిన ఫిర్యాదులు కూడా అధికారులు స్వీకరించి విచారణ జరపవచ్చునన్నారు. బక్రీద్ సందర్భంగా గోవధ నియంత్రణకు మండల, డివిజన్ గ్రామ స్ధాయిలో సంబంధిత అధికారులతో చట్టాన్ని పర్యవేక్షించేలా ప్రత్యేక బృందాలు నియమించడం జరిగిందన్నారు. కబేళాలో మాత్రమే పశువులను వధించాలని అన్నారు. కబేళాలో ప్రస్తుతం ఉన్న పశు సంవర్థక వైద్యునకు అదనంగా గొల్లపూడి, పటమట నుంచి ఇద్దరు వెటర్నరీ డాక్టర్లను నియమించడం జరిగిందన్నారు. వీరు జూలై 1వ తేది వరుకు 24 గంటలు విధులను నిర్వర్తించేలా ఆదేశించామన్నారు. పశువులను కబేళాకు తరలించే ముందు పరిశీలించి, ఫామ్`ఎ సర్టిఫికేట్ ఉంటేనే దానిని నిర్థారించి లోపలికి అనుమతిస్తారన్నారు. దీనికి పోలీస్ శాఖకు చెందిన అధికారిని నోడల్ ఆఫీసర్‌గా నియమించడం జరిగిందన్నారు. రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి ఆర్‌డివో, పోలీస్ శాఖ నుండి డిఎస్‌పి, పశుసంవర్థక శాఖ డిప్యూటి డైరెక్టర్ టీమ్ సభ్యులుగాను, మండలానికి సంబంధించి పశుసంవర్థక, తహాశీల్థార్, స్టేషన్ ఆఫీసర్‌లతో కూడిన ముగ్గురు సభ్యులు టీమ్‌గాను విధులు నిర్వర్తిస్తారన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలో పశు సంవర్థక శాఖ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ సభ్యులుగ కలిగిన టీమ్ గోవధ నిషేధ పశుసంరక్షణా చట్టాన్ని పర్యవేక్షిస్తారన్నారు. మత సామరస్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకుని జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ డిల్లీరావు కోరారు.అనంతరం గోవధ నిషేధ పశుసంరక్షణ చట్ట`1977 పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ డిల్లీరావు విడుదల చేశారు.సమావేశంలో మున్సిపల్ కమీషనర్ స్వప్నల్ దినకర్‌పుడ్కర్, జాయింట్ కలెక్టర్ డా. పి సంపత్ కుమార్, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్ డిసిపి యం. సత్తిబాబు, పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ కె. విద్యాసాగర్, బీఫ్ మర్చంట్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీలు యండి రీజ్వాన్‌హుల్లా ఖురేషి, యండి హతీమ్ ఖురేషి, నగరపాలక సంస్థ ఛీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ రవిచంద్, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి షంసున్నీసా బేగం, వెస్ట్, సౌత్, నార్త్, సెంట్రల్ ఏసిపిలు, సంక్షేమ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News