– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన కాపునేస్తం పథకం అక్కచెల్లెమ్మలకు ఓ వరమని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. కండ్రికలోని హెల్త్ సెంటర్ ప్రాంగణంలో నాలుగో విడత కాపు నేస్తం లబ్ధిదారులతో స్థానిక కార్పొరేటర్ యరగొర్ల తిరుపతమ్మతో కలిసి బుధవారం ఆయన సమావేశమయ్యారు. వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 45-60 ఏళ్ల లోపు ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన పేద మహిళలకు ఒక్కొక్కరికి రూ. 15 వేలు చొప్పున లబ్ధి చేకూరుతోందని మల్లాది విష్ణు అన్నారు. ఇప్పటికే మూడేళ్ల పాటు ఒక్కో మహిళ పేరిట రూ. 45 వేలు జమ చేశారని.. నాలుగో విడత కలుపుకుంటే రూ. 60 వేలు అవుతుందన్నారు. ఒక్క సెంట్రల్ నియోజకవర్గంలోనే 2,583 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో నాలుగేళ్లలో రూ. 12 కోట్ల నగదు జమ చేసినట్లు వెల్లడించారు. నాలుగో విడత ద్వారా రూ. 3 కోట్ల 87 లక్షల 45 వేల మేలు చేకూర్చగా.. డివిజన్ పరిధిలో 168 మందికి రూ.25.20 లక్షల లబ్ధి చేకూర్చినట్లు తెలియజేశారు. ఈ సాయంతో కూరగాయలు, పచ్చళ్లు, చీరలు, బొమ్మలు వంటి వ్యాపారాలు ప్రారంభించినట్లు గడప గడపకు మన ప్రభుత్వంలో మహిళలు వివరిస్తుండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని మల్లాది విష్ణు అన్నారు. ఈ నగదుకు అనుబంధంగా బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి మహిళలు వ్యాపారాలు చేసుకునేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందిస్తున్నట్లు తెలిపారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని అక్కచెల్లెమ్మలు సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని ఆకాంక్షించారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా కాపుల అభ్యున్నతికి ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అందించిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే అన్నారు. ఎవరైనా సాంకేతిక కారణాలతో పథకానికి ఎంపిక కాకపోతే.. ద్వైవార్షికంలో ఎంపిక చేసి నగదును అందించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే కాపు సామాజిక ప్రజలు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకునే విధంగా.. రూ. కోటి నిధులతో కాపు కళ్యాణ మండపం నిర్మిస్తున్నట్లు మల్లాది విష్ణు తెలిపారు. దివంగత నేత వంగవీటి మోహనరంగా పేరుతో నిర్మిస్తున్న ఈ కళ్యాణ మండపాన్ని వీలైనంత త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ.. ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News