రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం నుంచి అందిన జర్నలిస్టుల అర్హుల జాబితాను పరిగణనలోకి తీసుకుని అనుకూలమైన ప్రాంతాన్ని పరిశీలించి, తదుపరి కమిటీ సభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని స్థలాలు సేకరణ చెయ్యనున్నట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలియ చేశారు మంగళవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు (హౌస్ సైట్ ) గుర్తింపు అంశంపై పాత్రికేయ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జిల్లాలో జర్నలిస్ట్ లకి కేటాయించాల్సిన స్థలాలు గుర్తించి, జర్నలిస్ట్ సభ్యుల అభిప్రాయాలను పరిగణన లోకి తీసుకుని వేగవంతం చెయ్యడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులకు అనుగుణంగా జర్నలిస్టులకు జిల్లా పరిధిలో అనుకూలమైన ప్రాంతాల్లో స్థల సేకరణ చేపట్టి సాధ్యమైనంత తొందరలో ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం తరపున అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆమేరకు మరో దఫా సమావేశం నిర్వహించి జర్నలిస్ట్ ల అభిప్రాయాలను తెలుసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో సాధ్యమైనంత తొందరలో జర్నలిస్ట్ లకి అనుకూలమైన ప్రాంతంలో స్థలాలు గుర్తించి, భూసేకరణ ప్రక్రియ ద్వారా సమీకరించే ప్రక్రియ సంబంధిత వివరాలు ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందని అన్నారు.
ఈ సమావేశంలో పాత్రికేయులకి చెందిన కమిటీ సభ్యులు ఎమ్. హరీష్ కుమార్, టి. అప్పలనాయుడు, పివివి సత్యనారాయణ , డి ఐ పిఆర్వో సిహెచ్. శ్రీనివాస్, డి పిఆర్వో ఐ. కాశయ్య, డివిజనల్ పిఆర్ఓ ఎం ఎల్ ఆచార్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News