విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచటంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీరప్రాంతాలలో చేప పిల్లలను విడుదలచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ, శాసన సభ్యులు యలమంచిలి సత్యన్నారాయణ (సుజనా చౌదరి) లు తెలిపారు.
జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం సమీపంలో గల భవానీ ఘాట్ వద్ద శనివారం జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి సత్యన్నారాయణ (సుజనా చౌదరి) కృష్ణనదిలో చేప పిల్లలను విడుదల చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంతో పాటు మత్స్యసంపదను పెంచటానికి రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా కృష్ణనది పరివాహాక ప్రాంతంలో చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని ఏడు నెలల అనంతరం మత్స్యకారులు ఉచితంగా చేపలను వేటాడి వాటిని విక్రయించుకొని ఆర్ధిక ప్రయోజనం పొందాలన్నదే ఈ కార్యక్రమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకొని ఆర్ధిక పురోగతి సాధించాలని కలెక్టర్ కోరారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు యలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్ధిక ప్రయోజనాలు చేకూర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను అమలుచేస్తుందన్నారు. ప్రధానమంత్రి మత్స్యసంపద యోజన పధకం ద్వారా మత్స్యకారులకు నాలుగు చక్రాలు, మూడు చక్రాలు, ద్వి చక్ర వాహనాలను సబ్సిడీ పై అందజేస్తున్నట్లు తెలిపారు. వేటకు వెళ్లే మత్స్యకారులకు లైసెన్స్ లు మంజూరుచేయడం జరుగుతుందని 50 సంవత్సరాలు పైబడిన మత్స్యకారులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారుల కుటుంబాలకు నష్టపరిహారం కింద ఆర్ధిక సహాయం అందజేస్తున్నట్లు తెలిపారు. భవానీపురం వద్ద కృష్ణనదిలో 7.50 లక్షల రాగండి రకం చేపల పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని ఏడు నెలల అనంతరం అవి సుమారు 5.25 లక్షల కేజీలుగా ఎదుగుతాయన్నారు. ఒక కేజీ చేప ఖరీదు 100 రూపాయల చొప్పున మత్స్యకారులకు సుమారు 525 కోట్ల రూపాయలు ఆదాయం సమకూరుతుందన్నారు. మత్స్యకారుల ఆర్ధిక ప్రయోజనంతో పాటు వినియోగదారులకు తక్కువ ధరకే మత్స్య ఉత్పత్తులు అందుబాటుధరకు దొరికే అవకాశం ఉంటుందని సుజనా చౌదరి తెలిపారు.
కార్యక్రమంలో మత్స్యశాఖ కమీషనర్ టి. డోలా శంకర్, జిల్లా మత్స్య శాఖ అధికారిణి సిహెచ్ ఎస్. చక్రాణీ, డెవలప్ మెంట్ ఆఫీసర్ పి. అఖిల, విఫ్ఏ. ఎలియా రామారావు, స్థానిక నాయకులు బొమ్మసాని సుబ్బారావు, తహశీల్ధార్ ఇంతియాజ్ పాషా, కార్పొరేటర్ రెహమ్ తున్నీసా, దర్గా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కన్నా వెంకటేశ్వరరావు, విజయవాడ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మోపిదేవి ఏడుకొండలు, మత్స్యకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News