-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం నుండి అందిన మార్గదర్శకాల మేరకు మొదటి దశలో దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారికి, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియను వచ్చే సోమవారం నుండి పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ గారు పిడి వెలుగు, డి ఎం హెచ్ ఓ, డిసిహెచ్ఎస్, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్, జిల్లా పరిషత్ సిఈఓ, చిత్తూరు, నెల్లూరు, డిప్యూటీ సీఈఓ, డిపిఓ, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి, డి ఎల్ డి వో లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, వెరిఫికేషన్ టీంలోని సభ్యులు అందులోని స్పెషలిస్ట్ డాక్టర్లు, డిజిటల్ అసిస్టెంట్లు తదితర సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దీర్ఘకాలిక రోగంతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించిన పెన్షన్ల వెరిఫికేషన్ ప్రక్రియ పక్కాగా నిర్వహించాలని దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనర్హులు కూడా సామాజిక భద్రత పెన్షన్లను పొందుతున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టడానికి మార్గదర్శకాలు విడుదల చేసిందని అందులో మొదటి దశలో దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, అలాగే దీర్ఘకాలిక రోగంతో మంచానికే, వీల్ చైర్ కి పరిమితమైన 15 వేల రూపాయల పెన్షన్ పొందుతున్న పేషంట్ల గృహ సందర్శన వెరిఫికేషన్ బృందం వచ్చే సోమవారం నుండి పక్కాగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వెరిఫికేషన్ బృందంలో ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లకు, సంబంధిత పిహెచ్సి డాక్టర్, డిజిటల్ అసిస్టెంట్, సచివాలయం సిబ్బంది ఉంటారని పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్ లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. సదరు పెన్షన్ లబ్ధిదారుల గృహ సందర్శన చేసి, వారి ఆరోగ్య వివరాలను అధికారులు తక్షణమే యాప్ లో నమోదు చేయాలన్నారు. నూరు శాతం నిక్కచ్చిగా పరిశీలన, విచారణ ప్రక్రియ చేపట్టాలన్నారు. ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లు సక్రమంగా జరిగేలా చూడాలని అన్నారు. ఈ నెలాఖరులోపు జిల్లాలోని సదరు మంచానికి పరిమితమైన 1199 మంది దీర్ఘ కాలిక రోగాల పేషంట్లకు సంబంధించిన పెన్షన్ల రీ వెరిఫికేషన్ పూర్తి చేయాలని సూచించారు. కొత్తగా బోగస్ సదరం సర్టిఫికెట్లు ఇచ్చినట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులపై కఠినమైన చర్యలు ఉంటాయని కలెక్టర్ హెచ్చరించారు. వెరిఫికేషన్ బృందాలకు నేటి సాయంత్రం శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు.
ఈ టెలీకాన్ఫరెన్స్ నందు పథక సంచాలకులు వెలుగు శోభన్ బాబు, డిప్యూటీ సీఈవో జుబేదా జిల్లా పరిషత్, డిఎంహెచ్ఓ బాలాజీ నాయక్, డి సి హెచ్ ఎస్ ఆనందమూర్తి రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి ప్రభు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి నారాయణరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారిని సుశీల దేవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News