విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్తగా విడుదల కానున్న సినిమా టికెట్ల ధరలను పెంచుతూ, బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. సంక్రాంతి పండుగ సమయంలో ఏపీలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలకు టికెట్ల ధరలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాత్రి ఒంటిగంట బెనిఫిట్ షో టికెట్ ధర రూ.600, మల్టీప్లెక్స్ టికెట్ కు అదనంగా రూ.175, సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ కు అదనంగా రూ.135 పెంచింది. ఏపీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
సినిమా టిక్కెట్ ధరల పెంపుపై గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతున్నాం. ‘డిమాండ్ అండ్ సప్లైని బట్టి టికెట్ రేట్స్ పెంచాలని, బ్లాక్ టిక్కెట్ల రూపంలో డబ్బులు ఎవరికో వెళ్ళకుండా ఉండేందుకు టిక్కెట్ల రేట్లు పెంచుతున్నామని, అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని’ పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ప్రజల అభిమానాన్ని బలహీనతగా చూస్తారా? బ్లాక్ టిక్కెట్లు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టకుండా టిక్కెట్ల రేట్లు పెంచటం కుంటి సాకులు కావా? ప్రభుత్వానికొచ్చే 18% జీఎస్టీ కోసం వందల రూపాయలు టిక్కెట్ రేట్లు పెంచడం తగునా? చిత్ర నిర్మాణ సంస్థకు 82%, ప్రభుత్వానికి 18% లాభాలు, ప్రేక్షకుల జేబులకు మాత్రం చిల్లులా? ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు మద్దతు ధరలు కల్పించడంలో మెతక వైఖరి అవలంబించే పాలకులు కోటీశ్వరులైన నిర్మాతలకు మేలు చేకూర్చడాన్ని ఏమనాలి? ఢిల్లీ నడివీధుల్లో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఎందుకు నోరు మెదపలేకపోయారు? పెద్ద హీరోలు తీసుకునే కోట్లాది రెమ్యునరేషన్, ఏళ్ల తరబడి చిత్ర నిర్మాణం, భారీ సెట్టింగులు, అట్టహాసపు వృధా ఖర్చులు తగ్గించుకుంటే సినిమా నిర్మాణ వ్యయం తగ్గదా? భారీ బడ్జెట్లతో సినిమాలు తీయడం ఎవరి ప్రయోజనాల కోసం? అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర తరహాలో ఏపీలో కూడా సినిమా టిక్కెట్ల ధరలు పెంపు, బెనిఫిట్ షో ల యోచన విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News