Breaking News

సంక్రాంతి కానుకగా రూ.6,700 కోట్ల బకాయిల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్

-రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
సంక్రాంతి కానుకగా వివిధ వర్గాలకు చెందిన బిల్లుల బకాయిలు రూ.6,700 కోట్ల విడుదలకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. శనివారం ఉండవల్లిలో ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ సమీక్ష అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు మరియు పెండింగ్ బిల్లుల విడుదలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాదాపు 3 గంటల పాటు సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలు తీసుకున్నారు అని ఆయన తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు, చిన్న చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు మరియు అమరావతి రైతులకు కౌలు బకాయిలు మొత్తము రూ.6,700 కోట్ల విడుదల చెల్లింపు కు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు అన్నారు. ఇందులో ఉద్యోగుల జిపిఎఫ్ , సరెండర్ లీవ్, సిపిఎస్ బకాయిలు మొత్తము రూ .1300 కోట్లు విడుదల చేస్తున్నట్టు ఆయన తెలిపారు. జీపీఎఫ్ బకాయిలు రూ.519 కోట్లు, పోలీస్ సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు, సిపిఎస్ బకాయిలు రూ.300 కోట్లు, టీ డి ఎస్ బకాయిలు రూ.265 కోట్లు విడుదల చేస్తున్నామన్నారు. 6.50 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చే విధంగా ఫీజు రీయింబర్స్మెంట్ మరియు ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్ బకాయిలు రూ.788 కోట్లు, విద్యుత్ శాఖ రాయితీ బకాయలు రూ.500 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ బకాయిలు రూ .400 కోట్లు, డ్రగ్స్ మరియు మెడిసిన్స్ బకాయిలు రూ .100 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ఎంతో మంది చిన్నచిన్న కాంట్రాక్టర్లు కనీసం రూ .5 & 10 లక్షల లోపు బిల్లులు కూడా అందకుండా పలు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. ఆ విధంగా ఇబ్బంది పడుతున్న 26 వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా రూ .586 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 651 ఎమ్మెస్ ఎం ఈ లకు మరియు మరో 6000 మంది మైక్రో ఎంటర్ప్రైన్యూర్లకు లబ్ది చేకూర్చే విధంగా రూ. 90 కోట్ల పెండింగ్ బకాయిలను విడుదల చేస్తున్నామన్నారు. అదేవిధంగా అమరావతి రాజధానికి, గన్నవరం ఎయిర్పోర్ట్ కు భూములు ఇచ్చిన రైతుల కౌలు బకాయిలు రూ .241 కోట్ల చెల్లింపుకు విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

గత ప్రభుత్వం అనుసరించిన ఆర్థిక విధానాల వల్ల రాష్ట్ర ఆర్థిక స్థితి చిన్నాభిన్నం అయ్యిందని, అటువంటి పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారాన్నారు. ఒకవైపు రూ .10 లక్షల కోట్ల బకాయిలు మరియు వాటిపై ప్రతిరోజూ వడ్డీ చెల్లించడంతోపాటు మరో రూ .1.30 వేల కోట్ల బకాయిల ఒత్తిడి ప్రభుత్వంపై ఉందన్నారు. వీటికి తోడు గత ప్రభుత్వం 60: 40 వాటాతో అమలు చేయాల్సిన 94 కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి కేంద్ర వాటాను పొంది రాష్ట్ర వాటాను చెల్లించకపోవడం వల్ల ఆ పథకాలన్నీ నిలిచిపోవడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి రూ .6000 కోట్లను కేంద్రానికి జమ చేసి 73 కేంద్ర ప్రాయోజిత పథకాలను పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పునరుద్ధరించేందుకు కూటమి ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు మంచి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆకాంక్షిత బ్లాక్ కార్య‌క్ర‌మం (ఏబీపీ)పై అధికారుల‌తో క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

-పెనుగంచిప్రోలు ఇబ్రహీంపట్నం బ్లాక్ లను టాప్ టెన్ లో నిలపండి…. -హెల్త్ ,ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ పై దృష్టి సారించండి….. -క‌లెక్ట‌ర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *