– జీవవైవిద్యం-పరిశ్రమల భాగస్వామ్యం, ఎకో-టూరిజం తదితర అంశాలపై చర్చలు
– ప్రకృతి పరిరక్షణ చర్యల కోసం CSR క్రింద ఏటా కోటి వెచ్చిస్తామన్న శ్రీసిటీ ఎండీ
– సూళ్లూరుపేట ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శ్రీసిటీ స్టాల్ ను ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త :
శనివారం ప్రారంభమైన ఫ్లెమింగో ఫెస్టివల్ లో ఎంపిక చేసిన ఐదు కీలక వేదికలలో ఒకటైన శ్రీసిటీ, జీవవైవిద్యానికి కార్పొరేట్ సహకారం, సుస్థిరత, ఎకో-టూరిజం అంశాలలో వినూత్న ఆలోచనలు రేకిత్తించే సదస్సులకు వేదికగా నిలిచింది. అలాగే సూళ్లూరుపేటలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శ్రీసిటీ ప్రగతిని ప్రతిబింబిస్తూ ఏర్పాటు చేసిన స్టాల్ ను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు.
శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో జరిగిన కార్పొరేట్ సామాజిక భాద్యత (CSR) సదస్సులో కార్పొరేట్ చొరవ ద్వారా పర్యావరణ నిర్వహణ, సామాజిక స్పృహ అనే అంశాలను చర్చించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్, తిరుపతి సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ సి.సెల్వం, బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS) డా. సత్య సెల్వం, శ్రీసిటీ చైర్మన్ సి.శ్రీనిరాజు, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, వివిధ పరిశ్రమల ఉన్నతాధికారులు పాల్గొని సమిష్టిగా వివిధ కీలక అంశాలపై ప్రస్తావించారు.
ఫ్లెమింగో ఫెస్టివల్‌లో శ్రీసిటీ పాల్గొనడం సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ పట్ల దాని నిబద్ధతకు నిదర్శనం అంటూ కలెక్టర్ వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు. పులికాట్ సరస్సు, నేలపట్టు కు సంబందించిన ప్రాముఖ్యతను, జీవవైవిధ్యాన్ని వివరించారు. జీవవైవిధ్యాన్ని రక్షించడానికి, ప్రకృతితో సమతుల్య సంబంధాన్ని పెంపొందించడానికి పరిశ్రమలు, స్థానికుల సహకారం యొక్క ఆవశ్యకతను హైలైట్ చేశారు.
శ్రీసిటీ యాజమాన్యాన్ని అభినందించిన సెల్వం, తిరుపతి సర్కిల్ జీవవైవిధ్యాన్ని వివరించారు. పర్యావరణ పరిరక్షణతో వ్యాపార లక్ష్యాలను సమతుల్యం చేయడానికి CSR కార్యక్రమాల అవసరాన్ని ఆయన వెల్లడించారు. పులికాట్ సరస్సు, వలస పక్షుల నివాసాలను రక్షించడానికి కార్పొరేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ BNHS డైరెక్టర్ డాక్టర్ కిషోర్ రితే ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. పరిరక్షణ ప్రయత్నాలను మరింత బలోపేతం చేయడం కోసం BNHSలో భాగస్వామ్యులు కావాలని కంపెనీలను కోరారు.
శ్రీనిరాజు మాట్లాడుతూ ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రీసిటీ నిబద్ధతను హైలైట్ చేశారు. ఇక్కడ కేవలం హరిత పరిశ్రమలను మాత్రమే ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభివృద్ధితో పాటు ప్రకృతి పరిరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించామని తెలిపారు. BNHS ప్రేరణతో తిరుపతి నేచర్ సొసైటీని స్థాపించి ప్రాంతీయ జీవవైవిధ్య అట్లాస్‌ను అభివృద్ధి చేసామన్నారు.
సుస్థిర భవిష్యత్తు కోసం మన దృక్పథానికి అనుగుణంగా పులికాట్ సరస్సు వంటి సంపదను కాపాడుకోవడానికి సమిష్టి, నిరంతర కృషి అవసరమని, ఇందుకోసం ఫ్లెమింగో ఫెస్టివల్ ఎంతో ఉపకరిస్తుందని డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రకృతి పరిరక్షణ ప్రయోజనం కోసం శ్రీసిటీ పారిశ్రామిక కుటుంబం తరపున CSR క్రింద ఏటా కోటి రూపాయలు వెచ్చిస్తామని ప్రకటించారు.
ఈ సందర్భంగా, శ్రీసిటీ పరిశ్రమల CSR ప్రయత్నాలను అభినందిస్తూ, జిల్లా కలెక్టర్, శ్రీనిరాజు ఇతర ప్రముఖుల సమక్షంలో IMOP, NS ఇన్స్ట్రుమెంట్స్, కెల్లాగ్స్, పార్సన్ ప్యాకేజింగ్స్, ఇసుజు మోటార్స్, THK, కోల్గేట్ పామోలివ్, డైకి అల్యూమినియం, బెర్గెన్ పైప్స్, డానియెలీ, హామిల్టన్, ఆస్ట్రోటెక్, పియోలెక్స్, SMCC, వెస్ట్ ఫార్మా పరిశ్రమల అధికారులకు జ్ఞాపికలను అందచేశారు.
సదస్సులో పలువురు పరిశ్రమల ప్రతినిధులు ప్రసంగిస్తూ ఫ్లెమింగోలతో సహా వలస పక్షుల కోసం ఆవాసాలను రక్షించడానికి పరిశ్రమ-సమాజం సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రస్తావించారు.
అలాగే, స్థానిక క్రియా విశ్వవిద్యాలయంలో జీవవైవిధ్యం, చిత్తడి నేలల సంరక్షణపై రెండు రోజుల సమావేశం కూడా బిఎన్‌హెచ్‌ఎస్ కు చెందిన డాక్టర్ సత్య సెల్వం అధ్యక్షతన శనివారం ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER), పక్షి శాస్త్ర నిపుణుల భాగస్వామ్యంతో జరిగిన ఈ సమావేశంలో పులికాట్ సరస్సు యొక్క పర్యావరణ ప్రాముఖ్యతను ప్రముఖంగా చర్చించారు. వృక్ష, జంతు వైవిధ్యం, మత్స్య మరియు పర్యాటక ప్రయోజనాలు, హైడ్రోలాజికల్ డైనమిక్స్, వాతావరణ మార్పు ప్రభావాలు, కాలుష్యం తగ్గించడం, స్థిరమైన పద్ధతులు, పరిరక్షణ ప్రయత్నాలలో సమాజ భాగస్వామ్యం గురించి కీలక చర్చలు జరిగాయి.
Prajavartha Online Telugu News