మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, పరిశ్రమలు, చేనేత, పెడన మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించి పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటు, అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎం ఎస్ ఎం ఈ లో భాగంగా పెడనలో కలంకారి క్లస్టర్ ఏర్పాటుకు రెవెన్యూ, టూరిజం, చేనేత జౌళి, మున్సిపల్ అధీనంలో ఉండి గుర్తించిన స్థలాలు ఎంఎస్ఎమ్ఈ కి బదిలీకి చర్యలు తీసుకోవాలన్నారు. క్లస్టర్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలన్నారు.
పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఈ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ పెడనలో కలంకారీ క్లస్టర్ పనులు వేగంగా జరిగేలా చూడాలని, తద్వారా కార్మికుల ఉపాధికి కృషి చేయాలని అన్నారు. నియోజకవర్గంలో 15 వేల మంది పైగా కలంకారీ పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారన్నారు. ఈ క్లస్టర్ ద్వారా కలంకారీని ఆధునికరించి డిజైన్ డెవలప్మెంట్, బ్లాక్ మేకింగ్, కలంకారిలో వాడే రా మెటీరియల్ బ్యాంక్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవడం ద్వారా తక్కువ ధరలకే రా మెటీరియల్ దొరకటానికి వీలవుతుందన్నారు. తద్వారా కార్మికులకు లబ్ధి చేకూరుతుందన్నారు.
రాష్ట్ర బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రెసిడెంట్ బి ప్రసాద్ కార్యదర్శి జంపాల శ్రీను సమావేశంలో పాల్గొన్నారు
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, బందర్ ఆర్ డి ఓ కే. స్వాతి, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం. ఆర్ వెంకట్రావు, పెడన మున్సిపల్ కమిషనర్ ఎం గోపాల్ రావు, పెడన తాసిల్దార్ అనిల్ జిల్లా టూరిజం అధికారి రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు.