మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించుటకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ బుధవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై పలు సూచనలు చేశారు. ఇంటర్మీడియట్ ధియరి ఎగ్జామ్స్ మార్చి 1వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయని, 20వ తేదీ వరకు జరుగుతాయని, పరీక్షా సమయాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ/ ఎయిడెడ్ /సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలు 55, ప్రైవేట్ జూనియర్ కళాశాలు 114, మొత్తం 169 కళాశాలలు ఉన్నాయని అన్నారు.
జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం మొదటి సంవత్సరం 24,557 మంది విద్యార్థులు, రెండవ సంవత్సరం 20,873 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు జిల్లాలో 63 థియరీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షలు ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కు అవకాశం లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. ప్రశ్నాపత్రాలు లీకేజీ కాకుండా తగిన భద్రతతో డిస్ట్రిక్ట్ స్ట్రాంగ్ రూములో భద్రపరచాలని, అక్కడ నుంచి వివిధ పోలీస్ స్టేషన్లకు, అక్కడినుండి పరీక్షా కేంద్రాలకు తరలించినప్పుడు తగిన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షలు ఏరోజుకారోజు జవాబు పత్రాలు, కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ డిస్పాచ్ చేయుటకు పోస్ట్ ఆఫీస్ లలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రూరల్ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుటకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రజా రవాణా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణ మానిటరింగ్ చేయాలన్నారు
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్ తక్కువ ఎత్తు ఉన్న చోట్ల జంప్ చేసి వచ్చే అవకాశం గలచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలు పోలీస్ సిబ్బంది విజిట్ చేసి ఇలాంటి ప్రదేశాలు గుర్తించాలన్నారు. డిఆర్వో కె చంద్రశేఖరరావు, ఆర్ ఐ ఓ పిబి సాల్మన్ రాజు, జిల్లా పరీక్షల కమిటీ ప్రత్యేక అధికారి ప్రసాద్ శాస్త్రి, సభ్యులు ఎన్ వి నరసింహారావు, పి నాగ రవి, జి వెంకటరమణ సమావేశంలో హాజరు కాగా, డీఈవో పివిజే రామారావు డి పి టి ఓ వాణిశ్రీ, డిఎం అండ్ హెచ్ వో డాక్టర్ ఎస్ శర్మిష్ట వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.