గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని చౌడవరం రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో మౌలిక వసతులను కల్పించడానికి తగిన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కమిషనర్ చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతంలో త్రాగునీటి సరఫరా, పారిశుధ్య పనులను పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చౌడవరం రాజీవ్ గృహకల్పలో నివశించే ప్రజలకు నగరపాలక సంస్థ నుండి మౌలిక వసతులు కల్పించాలన్నారు. గృహకల్ప బ్లాక్ ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, 2 రోజుల్లో చుట్టూ ఉన్న జంగిల్ క్లియర్ చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గృహకల్ప ప్రాంతంలోని బోర్లు మరమత్తులు చేయాలని, అవసరమైతే నూతన మోటార్ల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. అపార్ట్మెంట్ పైన ఉన్న నీటి ట్యాంక్ లు, వాటిలో ప్రస్తుతం వినియోగంలో ఉన్నవాటికి నీటిని పంపింగ్ చేయాలని ఏఈని ఆదేశించారు. గృహకల్ప నివాసాలకు ఆస్తి పన్ను వేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారిని ఆదేశించారు. చెత్త సేకరణ, డ్రైన్ల శుభ్రం జరగాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని, కార్యదర్శిని ఆదేశించారు. అలాగే రోడ్ల మీద, అపార్ట్మెంట్ ఖాళీ స్థలాల్లో వ్యర్ధాలు వేసే వారిని గుర్తించి అపరాధ రుసుం విధించాలన్నారు.
తొలుత శ్రీనివాసరావుతోట ప్రజారోగ్య మస్టర్ పాయింట్ ని పరిశీలించి, ప్రజారోగ్య విభాగంలో సూపర్వైజర్ల పోస్ట్ లు లేవని, డివిజన్ పరిధిలో సూపర్వైజర్లు ఉన్నారని ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, ఇప్పటి వరకు ఆ పేరుతో ఉన్న వారికి పారిశుధ్య పనులు కేటాయించాలని, లేకుంటే ఇన్స్పెక్టర్ల పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పర్యటనలో డిఈఈ సతీష్, ఏఎంహెచ్ఓ ఆనందకుమార్, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
