గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ స్థాయి సంఘ (స్టాండింగ్ కమిటీ) ఎన్నికల్లో భాగంగా 57వ డివిజన్ కార్పొరేటర్ పఠాన్ రిహాన, 19వ వార్డ్ కార్పొరేటర్ తేలుకుట్ల హనుమాయమ్మలు తమ నామినేషన్లను ఉప సంహరణ చేసుకున్నారని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ చే ఎన్నికల అధికారిగా నియమింపబడిన నగరపాలక సంస్థ అదనపు కమిషనర్, స్టాండింగ్ కమిటి ఎన్నికల అధికారి చల్లా ఓబులేసు బుధవారం తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు 17 మంది కార్పొరేటర్లు నామినేషన్లు దాఖలు చేశారని, ఈ నెల 30వ తేదీ (గురువారం) మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉప సంహరణ గడువు ఉందన్నారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉండే తుది అభ్యర్ధుల జాబితా ప్రకటిస్తామని, ఫిబ్రవరి 3వ తేదీ ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ మందిరంలో ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.
