విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సంధర్భంగా బుధ వారంనాడు నందిగామలోని కాకతీయ అపోలో స్కూల్ నందు అనసాగరం గ్రామంలోని ప్రభుత్వ జడ్పిఎచ్ స్కూల్ లోని విధ్యార్ధులకు రహదారి భద్రత నియమాలపై అవగాహన సదస్సును ఆర్టీఓ యం.పద్మావతి నిర్వహించారు. ఈ సంధర్భంగా ఆర్టీఓ యం.పద్మావతి మాట్లాడుతూ విధ్యార్ధులకు రహదారి భద్రతపై అవగాహన పెంపొందించే విధంగా ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించమని ఆర్టీఓ అన్నారు. రోడ్డు భద్రతపై విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థి దశ నుండే రహదారి భద్రత నియమాలు తెలుసుకోవాలన్నారు. రోడ్లు దాటేటప్పుడు పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పిల్లలకు చెప్తుండాలని ఆమె అన్నారు.
జీబ్రా క్రాసింగ్ వద్ద మాత్రమే రోడ్డు దాటడం, బస్సు ఆగినప్పుడు మాత్రమే ఎక్కడం, దిగడం వంటివి చెయ్యాలని ఆమె అన్నారు. హెల్మెట్ సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపొద్దని, మితిమీరిన వేగంతో వెళ్ళొద్దని, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి ప్రాణాలు కోల్పోవద్దని ఆమె అన్నారు. రహదారి భద్రత పై నిర్వహించిన క్విజ్, వ్యాసరచన పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ఆర్టీఓ అందజేశారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో నందిగామ మోటార్ వాహన తనిఖీ అధికారి యం. పూర్ణిమ, పరిపాలన అధికారి బి ఎస్ కె ప్రభాకర లింగం, ప్రభుత్వ Z.P.H స్కూల్ హెడ్ మాస్టర్ సిహెచ్ శ్రీనివాస రావు, కాకతీయ అపోలో స్కూల్ ప్రిన్సిపల్ కె.రవీంద్ర , అన్నపూర్ణ డ్రైవింగ్ స్కూల్ సీనియర్ ఇన్స ట్రక్టర్ సిహెచ్ రామరావు, విధ్యార్ధులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.